ఆ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’
ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరిగిన తరుణంలో భారతసైన్యం ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. ముఖ్యంగా 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. గత 21 ఏళ్లలో భారత్ ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే. ప్రధాని కార్యాలయమే ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగస్వాములైన అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
గత రెండేళ్లలో జమ్ముకశ్మీర్‌లో వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది జవాన్లు అమరు లయ్యారు. ఆయా ఉగ్రదాడులు, వాటి వెనక ఉన్న కీలక ఉగ్రవాదుల జాబితాను సైన్యం ఇప్పటికే సిద్ధం చేసింది. సైనికుల త్యాగాలు వృథా కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది. మరోవైపు ఉగ్రదాడులతో భయకంపితులవుతున్న సాధారణ ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఆర్మీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి 3000 మందితో అదనపు బలగాలను మోహరించింది.
దేశంలోని ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఈ ఆపరేషన్ చేపట్టనుంది. అంతేకాకుండా స్థానికులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తోంది. 1995-2003 మధ్య కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సాయాన్ని కూడా ఆర్మీ కోరింది. స్థానిక పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది.
కీలక ఉగ్రవాదులను హతమార్చడంతోపాటు, ఆహారం, ఆయుధాలు, ఆశ్రయం కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో వారికి సహకరించే నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని మిలటరీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ జమ్ములోని డోడా, కఠువా, ఉధంపుర్, రాజౌరీ, పూంచ్, రియాసీల్లో కొనసాగుతోందని చెప్పారు. హిట్ లిస్టులో ఉన్న 55 మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లు సమాచారం ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, జమ్మును ఉగ్రవాద కేంద్రంగా మార్చాలనుకుంటున్న పాక్ ప్రణాళికలను భగ్నం చేయాలని భారత సైన్యం కృతనిశ్చయంతో ఉందన్నారు.