సేంద్రీయ ఎరువులతోనే బత్తాయి పంటలో అధిక దిగుబడి : ఉద్యానవన శాఖ
బత్తాయి తోటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలని ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి సూచించారు. నల్లగొండలో రాష్ట్రస్థాయి బత్తాయి రైతుల సదస్సు జరిగింది. అందులో ఆమె మాట్లాడారు. రసాయన ఎరువులను వాడటం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు దిగుబడి, నాణ్యత కూడా దారుణంగా పడిపోతాయని హెచ్చరించారు. పండ్ల తోటల్లో అంతర్ పంటగా జీలుగ, జనుము, వేరుశెనగ సాగు చేయాలని, దీని వల్ల భూసారం నిలకడగా వుంటుందని, నాణ్యమైన దిగుబడి కూడా వస్తుందన్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగుకు భూములు కూడా అనుకూలంగా వున్నాయని, నాటే సమయంలోనే నాణ్యత గల మొక్కలను ఎంపిక చేయాలన్నారు. డ్రిప్ పద్ధతి ద్వారా తోటలకు నీరందించాలని తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఇక.. ప్రభుత్వం తమకు పనిముట్లు, డ్రిప్, మల్చింగ్ షీట్లు, వేప పిట్, ఎరువులను సబ్సిడీపైన అందించాలని రైతులు కోరారు.