సేంద్రీయ పద్దతిలో హోలీ రంగుల తయారీ.. ఈ రంగులను తినొచ్చు కూడా
ఆనందకరమైన హోళీ పండగ వచ్చేసింది. వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమ.తపోదీక్షలో వున్న శివుడి దృష్టి మరల్చేందుకు బ్రహ్మ సూచన మేరకు మన్మథుడు అకాల వసంత రువుతును సృష్టించి, సమబాణ ప్రయోగతో పరమేశ్వరుడి మనస్సును చలింపచేస్తాడు. ఆగ్రహించిన శివుడు తన మూడో కన్నుతో రతీపతిని ఫాల్గుణపున్నమి నాడు భస్మం చేసినట్లు శివమహా పురాణం చెబుతోంది. అయితే.. మనలో వున్న కామాన్ని దహనం చేస్తున్నట్లు గుర్తుగా కామదహం చేస్తుంటాం. అలాగే రకరకాల రంగులతో ఆనందోత్సహాలతో రంగుల పున్నమి జరుపుకుంటాం. అయితే… గతంలో మన శరీరానికి గానీ, అవయవాలకు గానీ ఎలాంటి హానికరం కాని రంగులను వాడేవారు. హానికరం కాని రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా వుండేవారు. గత కొన్ని సంవత్సరాలుగా హానికరమైన రంగులతో హోళీ ఆడుతూ రకరకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఇద్దరు సోదరులు కొత్త ప్రయోగాన్ని లోకానికి పరిచయం చేశారు. గౌరంగ్, సౌరభ్ అనే ముంబై సోదరులు ఆర్గానిక్ పదార్థాలు, సేంద్రీయంగా పండిరచిన బియ్యం, మొక్కజొన్న లాంటి ఆర్గానిక్ పద్ధతులతో పండిరచిన వాటితో హోళీ కోసం రంగులను తయారు చేస్తున్నారు.
అంతేకాకుండా సేంద్రీయ విధానంలోనే పండిరచిన రకరకాల పువ్వులను అక్కడి భిల్ తెగకి చెందిన వ్యక్తులు పండిస్తున్నారు. ఈ పువ్వులను కూడా ఇందులో కలిపి, రంగులను తయారు చేస్తున్నారు. ఇలా సేంద్రీయంగా తయారు చేసిన హోళీ రంగులను అబీర్ హోళీ కలర్స్ పేరుతో మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఇలా సేంద్రీయంగా తయారు చేసిన వాటితో హోళీని జరుపుకోవాలని వారు పిలుపునిస్తున్నారు. ఇలా తయారు చేసిన రంగులను తినవచ్చు కూడా. జంతువులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ రంగులు పర్యావరణానికి హాని కావని, జంతువులకు కూడా సురక్షితంగా వుంటాయని వెల్లడిరచారు. ఈ రంగులు పూర్తిగా సహజమైన పద్ధతిలోనే తయారు చేశామని, అలాగే వీటిని ఆహారంగా కూడా స్వీకరించవచ్చని తెలిపారు. మొక్కజొన్న పిండి, నారింజ రంగులో వుండే పలాష్ పువ్వు, సేంద్రీయంగా పండిరచిన బియ్యంతో పాటు, అడవుల్లో లభించే వివిధ రకాల ఆకుల మిశ్రమం, అలాగే బాగా ఎండబెట్టిన బీట్ రూట్,, గంగానాగ్రి రోజ్ తో వీటిని తయారు చేస్తారు.
మొదటగా పువ్వులను కోస్తారు. ఆతర్వాత వాటిని శుభ్రం చేస్తారు. 15 నిమిషాల పాటు వాటిని ఉడకబెడతారు. తర్వాత జల్లెడ పడతారు. ఆ పువ్వులో పైన తెలిపిన మిశ్రమాన్నంతా కలిపేస్తారు. ఆ మిశ్రమాన్ని ఎండబెట్టి, ఆపై చేతితో బాగా కొడుతూ… కాస్త బాగుచేస్తారు. ఆ తర్వాత సేంద్రీయంగానే పండిరచిన మొక్కజొన్న పిండిని అందులో కలిపేస్తారు. ప్రజల్లో హానికరమైన రంగుల విషయంలో అవగాహన బాగా పెరిగిపోయింది. దీంతో సహజంగా వచ్చే రంగుల వైపు వారు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రీయంగా తయారు చేసిన ఈ హోళీ రంగులను ఈ సోదరులు మహారాష్ట్ర అంతటా పంపిస్తుంటారు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా పంపుతున్నారు. ఈ సారి హోళీ పండుగకు ఈ సంస్థ 5 టన్నుల సేంద్రీయ రంగులను అమ్మింది.