పెళ్ళిలో “ప్రకృతి వ్యవసాయ ప్రతిజ్ఞ”… మిల్లెట్ భోజనం…. సోషల్ మీడియాలో వైరల్
పెళ్లి వేదికగా భూతల్లిని కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ భూమిని కాపాడుకుందాం అంటూ పెళ్లికి వచ్చిన వారందరూ ప్రతిజ్ఞ చేసి, కొత్త ఒరవడికి తెర లేపారు. మహబూబ్‌నగర్ లోని పాలకొండ వాసవి కల్యాణ మండపంలో అమరవాది రాజనరసింహ కూతురి వివాహం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేయించారు. అమరవాది రాజనరసింహ గ్రామ భారతి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించినట్లు అవుతుందన్న సదుద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఏర్పాటు చేయించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు.
రసాయనిక పురుగుల మందుల వాడకంతో నేలతల్లి విషతుల్యంగా మారిపోయిందని గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షురాలు సూర్యకళ అన్నారు. ఈ భూమి విషతుల్యంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకకు హాజరయిన వారందరితో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ భూమిని కాపాడుకుందాం అంటూ ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విధానం ద్వారా పండిరచిన ఆహార ఉత్పత్తులతో వచ్చిన వారందరికీ ‘మిల్లెట్ భోజనం’ ఏర్పాటు చేశారు. దాదాపు 3 వేల మంది అతిథులతో ప్రతిజ్ఞ చేయించి, అందరికీ మిల్లెట్ భోజనం వడ్డించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.