మన దేహమే దేవాలయం
దైవం దేవాలయం -3
‘మన దేహమే దేవాలయం, జీవుడే సనాత దైవం’ అనే మాట మన హిందూ తాత్విక స్రవంతిలో ఒక భాగమైంది. శివమానస పూజా స్తోత్రంలో ‘ఆత్మాత్వంగిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం’ అన్నారు ఆదిశంకరులు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ శ్లోకం పూర్తిగా చదువుకుని పడుకోమన్నారు. అందుకే శివపూజ చేయాలంటే మనం కూడా శివుడు కావాలన్నారు. ఆదిశంకరుల వారి శ్లోకం ఇంకా ఉంది. ఆ శ్లోకం అర్థం తెలుసుకోవడం ముఖ్యం.
శివుడే తానై…
‘భగవంతుడే నా ఆత్మ. నా బుద్ధి హిమాల యాల నుండి జన్మించినది అంటే శివుని భార్య, నా ప్రాణశక్తులు, ఇంద్రియాలు నీ సేవకులు, నా శరీరం నీ నివాసం, వాస్తవిక ప్రపంచాన్ని అనుభ వించడం నీ ఆరాధన. నా నిద్ర సమాధి స్థితి. రెండు పాదాలతో కదలడం నీ చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఓ ప్రభూ! అన్ని మాటలు, ప్రసంగాలు నిన్ను గురించిన శ్లోకాలు. ఓ ప్రభూ! శంభో! నేను చేసే ఏ పని అయినా అది నీ ఆరాధన మాత్రమే.’ మన మాటలతో, మన చేతలలో, మన యెద కదిలే ప్రతి కదలికలో భగవంతుడున్నాడని భావించడమే దీని అర్థం.
భక్తి ప్రపంచం..
జీవాత్మ పరమాత్మలో కలిపేందుకే భక్తి ప్రపంచం. మన హిందూ గృహాలలో భక్తి తత్త్వం ఒక విడదీయరాని, విడదీయలేని అంగమైపోయింది. భగవంతుడి పూజలో భాగంగా శ్రీ రుద్ర లఘు న్యాసం అనబడే వేద మంత్రాలలో మన శరీరంలోని వివిధ అంగములను పరమాత్మకు, ప్రకృతికి అను సంధానించి చెప్పబడిరది. ‘‘పునరుత్పత్తి అవయవా లలో బ్రహ్మ, పాదములలో విష్ణువు, చేతుల్లో శివుడు, బాహువులలో ఇంద్రుడు, కడుపులో అగ్ని, హృదయంలో శివుడు, కంఠంలో దేవతలు, నోటిలో సరస్వతి, ముక్కులో వాయువు, కన్నులో సూర్యచంద్రులు, చెవులలో అశ్వనీదేవతలు (దైవిక వైద్యులు), నుదుటిపై రుద్రుడు, తలపై సూర్యుడు, శిరసులో మహాదేవుడు, శిఖలో వామదేవుడు, వెనుక భాగంలో విల్లుపట్టుకున్న శివుడు, ముందు భాగంలో త్రిశూలం పట్టుకున్న శివుడు, రెండు వైపులా శివశంకరులు, అంతటా వాయువు, ఇలా అందరూ దేవతలు అన్ని శరీర భాగాలలో నివసించి నన్ను రక్షింతురుగాక’’ అని వేదమంత్రం అర్థం. వివేకానందుడి మాటల్లో ప్రతి జీవి భగవంతుని స్వరూపమే (manifestation of god) అని అన్నారు.
ఆ శిక్షణ ఇవ్వాలి..
మన కుటుంబంలో మగ పిల్లాడు పుడితే శివుడు, రాముడు, కృష్ణుడు పుట్టాడని, ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని భావించే సంస్కారం ఉన్నది. పిల్లలు దేవుడితో సమానం అనేది తెలుగులో వాడే పదబంధం. పుట్టినప్పటి నుండి మనమిచ్చే అనేక రకాల శిక్షణ కుటుంబంలో పిల్లల వికాసానికి దోహదమవుతుంది. నాలో శివుడున్నాడు అనే వరకు ఈ శిక్షణ కొనసాగాలి. అది కొరవడితే పిల్లలు దారి తప్పుతారు. పిల్లలకు మనతోపాటు దైవ ప్రార్థన నేర్పాలి. గుళ్లు, గోపురాలు తిప్పాలి. ‘అహం బ్రహ్మాస్మి’ అన్నది వేదం. కొందరు దీనికి అహం భావం అన్ని వక్ర భాష్యం చెబుతున్నారు. ‘నేనే దేవుడను’ అనికాదు దీనర్థం. నేను స్వచ్ఛమైన ఆత్మను, చెడు గుణాలు, కోరికలు లేని శాశ్వత సత్యాన్ని అని అర్థం. ఈమాట బృహదారణ్యకో పనిషత్తులోనిది. నాలో బ్రహ్మమున్నది అని అర్థం. పుట్టినప్పుడు అజ్ఞానంలో, అంధకారంలో ఉంటాం. లోకాన్ని విడిచేటప్పుడు కూడా అలా ఉండకూడదు. జ్ఞానవంతుడై, చైతన్యవంతుడై శివునిలో ఐక్యం కావాలి. అదే సరైన జీవితం. అదే మోక్షం.