నాన్ స్టిక్ పాత్ర మహా డేంజర్… ICMR హెచ్చరికలు.. మట్టి పాత్రలు సేఫ్
ఈ మధ్య చాలా మంది నాన్‌స్టిక్ పాత్రలను బాగా వాడుతున్నారు. తక్కువ నూనెతో ఫ్రైలు చేసుకొని తినొచ్చని అందరూ ఇవే వాడుతున్నారు. అంతేకాకుండా తొందరగా కూడా వంట అయిపోతుంది. అయితే… ఈ నాన్‌స్టిక్ పాత్రల చాలా డేంజర్ అని, అస్సలు వాడొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గట్టిగా హెచ్చరికలు పంపింది. ఈ పాత్రల వాడటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని పేర్కొంది. నాన్‌స్టిక్ పాత్రలపై చిన్న గీత పడినా… దాని మీద వున్న టెప్లాన్ పూత నుంచి విషవాయువులు, హానికారక రసాయనాలు మనం తినే ఆహారంలో కలుస్తాయని తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని తెలిపింది.
గీతలు పడిన నాన్‌స్టిక్ వంట పాత్రలను 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద పంట చేసినప్పుడు ఈ ప్రమాదం వుందని తెలిపింది.ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం వుందని, అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని సంచలన విషయం బయటపెట్టింది. మరోవైపు ఈ పాత్రల వాడకం వల్ల హార్మోన్లలో అసమతౌల్యం, కేన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని హెచ్చరించింది. నాన్ స్టిక్ వంట పాత్రల బదులు మట్టి పాత్రల్లో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది. అంతేకాకుండా నాన్‌స్టిక్‌కి ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను వాడుకోవచ్చని సలహా ఇచ్చినది.
ఇక మట్టి పాత్రల్లో వంట చేస్తే ఎంతటి లాభం వస్తుందో చూపించారు.
పోషకాలను అందిస్తుంది:
నాన్ స్టిక్, అల్యూమినియం పాత్రల కంటే మట్టి కుండలు ఆరోగ్యానికి సురక్షితమైనవి. ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మట్టి కుండలలో వండిన ఆహారంలో ఉంటాయి. ఇలాంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పొట్టలో ఎసిడిటీ రాదు.
గుండెకు మంచిది:
మట్టి పాత్రల్లో వండిన ఆహారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాత్రలలో ఆహారాన్ని వండితే తక్కువ నూనె పడుతుంది. అందువల్ల మట్టి పాత్రలలో వండిన ఆహారాన్ని తినడం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు
డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేస్తుంది:
షుగర్ ఉన్నవారు మట్టి కుండలలో వండిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మట్టి కుండలో ఆహారాన్ని నెమ్మదిగా, సరిగ్గా వండుతారు. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది.
మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం
మట్టి కుండలలో వండిన ఆహారం తినడం లేదా మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ద్వారా మలబద్ధకం అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
pH స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది:
మీరు మట్టి కుండలో వండిన ఆహారాన్ని తింటే, అది pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిజానికి మట్టిలోని ఆల్కలీన్ స్వభావం ఆహారంలోని ఆమ్లంతో చర్య జరుపుతుంది, తద్వారా pH స్థాయి సమతుల్యం అవుతుంది.
ఆహారం రుచిని పెంచుతుంది:
మట్టి పాత్రల్లో వండడం వల్ల దాని రుచి పూర్తిగా మారిపోతుంది. నిజానికి నేల ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. మట్టి కుండలు ఆహారంలోని పోషకాలను బయటకు పోకుండా చేస్తాయి. కాబట్టి ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా వంట రుచిని కూడా పెంచుతుంది.