టన్నెల్‌ ‌మ్యాన్‌కు ‘పద్మ’ పురస్కారం

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందిం చిన 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. నలుగురికి పద్మ విభూషణ్‌, 17 ‌మందికి పద్మ భూషణ్‌, 107 ‌మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

వీరిలో చాలామంది సామాన్య వ్యక్తులే. కానీ వారు చేసిన విశేష కృషి వారిని అసాధరణ వ్యక్తులుగా మార్చింది. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారిలో కర్ణాటకకు చెందిన ‘‘అమై మహాలింగ నాయక్‌’’ ‌కు పద్మశ్రీ అవార్డు వరించడం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.

వ్యయవసాయ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌ ‌సమీపంలోని అడ్యనడ్క గ్రామానికి చెందిన మహాలింగ నాయక్‌ (70) ‌వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తన పంట పండించడానికి సరిపడా నీరు మాత్రం అందుబాటులో ఉండేది కాదు. బోరుబావులు తవ్వించి వ్యవసాయం చేసే ఆర్థిక స్థొమత కూడా ఆయనకు లేదు. కానీ ఆయన పట్టుదల మాత్రం ఆయనకు ఒక కొత్త ఆలోచనను తట్టేలా చేసింది.

విద్యుత్తు అవసరం లేకుండా గురుత్వాకర్షణ శక్తితో సొరంగాల ద్వారా నీటిని వ్యవసాయ పనులకు వినియోగించి వినూత్న పద్దతికి నాంది పలికాడు. బోరు బావులు తవ్వించలేని ఆర్థిక స్థితిలో సంప్రదాయ నీటి రంగాలతో నీటిపారుదల వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించాడు. వ్యవసాయ కూలీగా తనకున్న రెండెకరాల పొలాన్ని ఆదర్శప్రాయమైన నీటిపారుదల వ్యవసాయ భూమిగా మార్చారు.

గురుత్వాకర్షణ (గ్రావిటీ) ద్వారా తన పంటలకు నీటిని పారిస్తున్నాడు. ఎవరి సాయం తీసుకోకుండా ఒక్కడే  చేతి పనిముట్లతోనే ఐదు సొరంగాలను తవ్వాడు. సంప్రదాయ పద్దతుల్లో తన పంటలకు నీరు పారేలా చేశాడు.

అంతేకాదు, ఎత్తయిన ప్రదేశంలో ఉండే తన పంట పొలాలకు సమాంతరంగా ఈ సొరంగాలను తవ్వి.. పైపుల ద్వారా నీరు సరఫరా అయ్యేలా చేశాడు. తద్వారా రసాయన రహితంగా వ్యవసాయాన్ని సాగిస్తున్నాడు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా ఒక్కడే అయిదు సొరంగాలను త్రవ్వడంతో కన్నడ ప్రజలు ఆయన్ను ‘సొరంగా మాన్‌’ ‌లేదా ‘టన్నెల్‌ ‌మ్యాన్‌’‌గా పిలుస్తున్నారు. మరికొందరు మహాలింగ నాయక్ను ‘వన్మ్యాన్‌ ఆర్మీ’గా పేర్కొంటూ ప్రశంసిస్తూ నాయక్‌కు పద్మశ్రీ అవార్డు లభించడం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘70 ఏళ్ల వయస్సులో మహాలింగ నాయక్‌ ఎం‌తో గొప్ప విజయాన్ని సాధిం చారు. ఆయన నిజంగానే సింగిల్‌ ‌మ్యాన్‌ ఆర్మీ’’ అని  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ ‌షెకావత్‌ ‌ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు.

ప్రముఖ వ్యవసాయ నిపుణుడు శ్రీ పాడ్రే కూడా నాయక్‌కు పద్మశ్రీ రావడంపై స్పందిస్తూ.. ‘‘నాయక్‌ ‌సాంప్రదాయ పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. నాయక్‌ ‌నిర్మించిన సొరంగం మొదట్లో విఫలమై నప్పుడు అపహాస్యం పాలయ్యాడు. అయినా, వెనక్కి తగ్గకుండా సొరంగాన్ని తవ్వి తన పొలానికి నీటి ప్రవాహాన్ని మెరుగుపర్చాడు. ఇలా చిన్న నీటి రిజర్వాయర్‌ను నిర్మించాడు. నాయక్‌ ‌తన పొలంలో అనేక కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మిరియాల తీగలు, కోకోతో పాటు దాదాపు 300 అరకెన్‌ ‌తాటి చెట్లను పెంచుతున్నాడు’’ అని పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *