వెల్లివిరిసిన పద్మాలు

మహిళలు ఏం చేయగలరు అనే వారికి తగిన సమాధానమిస్తూ…తమ తమ రంగాల్లో రాణించారు ఈ మహిళలు. మరెందరికో స్పూర్తిని నింపారు. హరికథా ప్రవచనంలో మేటి స్వర్ణమహేశ్వరి అని పిలుచుకునే దాలిపర్తి ఉమా మహేశ్వరి సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. మచిలీపట్నానికి చెందిన ఈమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్ని ఇచ్చి ఎంపిక చేసింది. సావిత్రి, భైరవి, కుమారసంభవం, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణిలాంటి ప్రముఖ కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో ఈమె దిట్ట. పదికిపైగా సంస్కృతం, 25కి పైగా తెలుగులో హరికథలను ఆమె చెప్పగలదు.

లేడీ టార్జాన్‌ ఆఫ్‌ ఝార్ఖండ్‌

చామీ దేవి ముర్ముని ఝార్ఖండ్‌ లేడీ టార్జాన్‌ గానూ పిలుస్తారు. తమ ప్రాంతంలో టింబర్‌ మాఫియా, మావోయిస్టుల విధ్వంసంతో కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వల్లే ఈ పేరొచ్చింది. 1996లో అడవి అంతా మొక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు మూడువేల మందితో స్వయంసహాయక బృందాలను ఏర్పాటు చేశారు.  దీని ఫలితంగా  సుమారు 30,000 మంది మహిళల జీవితాల్లో మార్పు సాధ్యమయ్యింది.

నారియల్‌ అమ్మ…

అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల్లోని మారుమూల ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్‌ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని అందుకుంది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేష కృషి చేసినందుకుగానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దానివల్లే ఆమెను నారియల్‌ అమ్మగా పిలుస్తారు. దక్షిణ అండమాన్లోని రంగా చాంగ్‌కి చెందిన చెల్లమ్మాళ్‌ కొబ్బరి సాగులో విప్లవాత్మక మైన, వినూత్నపద్ధతులను అవలంబించారు.

ఆది తెగ మూలికలతో…

అరుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన మూలికావైద్య నిపుణురాలు యనుంగ్‌ జమోప్‌ా లెగోను పద్మశ్రీ వరించింది. ‘ఆది క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌’గా పిలిచే యనుంగ్‌ది తూర్పు సియాంగ్‌లోని మారుమూల గిరిజన పల్లె. అసోం విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు యనుంగ్‌.

ఔషధ మూలికా చికిత్సను పునరుద్ధరించాలని భావించిన ఈమె ఇందుకోసం ఔషధ మూలికల్ని సేకరించడం మాత్రమే సరిపోదని భావించారు. ప్రతి ఇంటా హెర్బల్‌ కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటుకి కృషి చేశారు.

ఏనుగుల శిక్షకురాలు

దేశంలోనే తొలి ఏనుగుల శిక్షకురాలుగా పేరు సంపాదించినంది పార్వతీ బారువా. 67ఏళ్ల పార్వతి కొన్ని దశాబ్దాలుగా ఒడిశా, పశ్చిమ్‌బంగ, అసోంలలో సేవలంది స్తున్నారు. ఏనుగులే కాదు, మావటులు, అటవీశాఖ వారికీ శిక్షణ ఇస్తున్నారు.

మధుబని శిక్షణలో…

మధుబని చిత్రకళలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కళాకారిణి శాంతిదేవి పాశ్వాన్‌ను ఈ ఏడాది ‘పద్మ’ అవార్డు వరించింది.  కళాభివృద్ధిలో ఈమె చేపడుతున్న కృషికి ‘తామ్రపాత్ర’, ‘అశోక్‌చక్ర’, ‘చేతనా సమితి’ వంటి జాతీయ, అంతర్జాతీయ  అవార్డులెన్నో అందుకున్నారీమె.

చక్మా చేనేతతో…

చేనేత కళలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు స్మృతిరేఖ చక్మా. అలనాటి చేనేత కళను నేటి తరానికీ అందిస్తున్నారు. వేల మంది గిరిజన మహిళలకు ఇందులో శిక్షణనిచ్చి ఉపాధిని కల్పించడంలో కృషి చేస్తున్నారు.  నూలుకు ఈమె వినియోగించే రంగులన్నీ వేర్లు, విత్తనాలు, మూలికలు, ఆకుల నుంచి తీసిన సహజ వర్ణాలే. ‘ఉజెయా జాధా’ పేరుతో గిరిజన మహిళలకూ.. శిక్షణనిచ్చి ఉపాధి పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నారు 63 ఏళ్ల స్మృతి.

నాట్య పద్మం 

భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ అందుకున్న వారిలో చెన్నైకి చెందిన ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఒకరు. పలువురు దేవదాసీల దగ్గర సమారు 150 ముద్రలను నేర్చుకున్నారు. అప్పుడే నృత్య చరిత్ర, థియరీల మధ్య అంతరం ఉందని భావించి దీనిపై పరిశోధనలు చేశారు. పుస్తకాలూ రాశారు పద్మ.

– లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *