వికసిత పద్మాలు
మహిళలు మీరేం చేస్తారు అన్న ప్రశ్నకు దీటైన సమాధాన్ని చెబుతూ… ఎంచుకున్న రంగమేదైనా కానీ తమదైన ముద్రను వేసి, దానికోసం తమ జీవితాన్ని ధారబోసారు. అనుక్షణం సమాజహితం కోసం పాటుపడుతూ ఎందరికో స్పూర్తిని కలిగిం చారు. అందుకే వారందరూ పద్మ అవార్డుకు ఎంపికయ్యారు.
సుధామూర్తి
గొప్ప మానవతా మూర్తిగా పేరుపొందిన సుధామూర్తి పేరు అందరికీ తెలిసిందే…విద్యావేత్త, రచయిత, వ్యాపారవేత్త అయిన సుధామూర్తి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి భార్య. వారు ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ గా కూడా కొనసాగుతున్నారు. 1996లో 45 సంవత్సరాల వయసులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను ప్రారంభించి, దాని ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రంథాలయాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్యం అందిస్తూ గ్రామీణాభివృద్ధిలో సహకరిస్తున్నారు. ఇలా ఎన్నో సేవాకార్యక్రమాలను చేస్తున్న వారికి 2006లో పద్మశ్రీ పురస్కారం రాగా, తాజాగా పద్మభూషణ్ వరించింది.
సుమన్ కళ్యాణ్ పూర్
లతామంగేష్కర్ ను పోలి ఉండే స్వరం ఆమెది. ఎంతలాగా అంటే సుమన్ పాడిన చాలా పాటలు లతమంగేష్కర్ పాడారు అనుకునేవారు చాలా మంది. బయట పాడడానికి ఇష్టపడక పోవడంతో దూరదర్శన్‌లో ప్రోగ్రాంలు ఇచ్చేవారు. అప్పట్లో పాడేవారి పేరు బయటకి చెప్పేవారు కాదు. దాంతో చాలామంది లతాజీనే పాడుతున్నారు అనుకునేవారట. హిందీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, మైథిలీ, భోజ్పురీ, రాజస్థానీ, బెంగాలీ, ఒడియా, పంజాబీలతో పాటు పలు భాషల్లో 750 వరకు పాటలు పాడారు. దాదాపు 20 ఏళ్ల పాటు సినీ సంగీత ప్రియుల్ని అలరించిన వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది.
ప్రీతికనా గోస్వామి
కుట్టు పనితో జీవితాన్ని ప్రారంభించిన ప్రీతి ఎందరోమహిళలలో వెలుగును నింపింది. తండ్రి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు కుట్టుపని నేర్చుకుని దాన్ని తన కెరీర్‌గా ప్రారంభించింది. అలా 15 సంవత్సరాలపాటు అదే వృత్తిని ఎంచుకున్న ఆమె పనితనాన్ని గుర్తించిన క్రాఫ్ట్ కౌన్సిల్ వర్క్ షాప్ పెట్టి తోటి ఆడవాళ్లకు ఆ కళని పంచాల్సిందిగా ఆమెని కోరింది. దాంతో కోల్కతాలో కొన్ని వేలమందికి ఆవిడ ఆ కళను నేర్పించారు. మాజీ రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఆమెకి తాజాగా పద్మశ్రీ లభించింది.
సుజాతా రామదొరై
బీజగణిత సంఖ్యా సిద్దాంత కర్తగా పేరుపొందిన సుజాతా పుట్టింది బెంగళూరులో. గణిత ఫ్రొఫెసర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ప్రస్తుతం భారత ప్రధానికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగానూ, నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మెంబర్ గానూ ఉన్నారు. గణిత శాస్త్రంలో వీరు చేసిన కృషికి గానూ పద్మశ్రీ దక్కింది.
హీరాబాయి లోబీ
గుజరాత్‌లోని జునాగఢ్ దగ్గర్లోని జాంబూరులో సిద్ది తెగకు చెందిన ఈమె…తమ తెగ జీవితాల్లో మార్పును తీసుకునివచ్చింది. ఐదువందల సంవత్సరాల క్రితం అప్పటి పాలకులు గిర్ సాసన్ అడవుల్లో ఉండే వీరిని బయటకు తీసుకుని వచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
ఊరైతే ఉంది కానీ వారికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలూ, కార్యక్రమాల గురించి ఏమీ తెలియవు. మొదట మహిళల్లో మార్పు తేవాలనుకుంది. అందుకోసం తమ పొలంలో సేంద్రీయ ఎరువల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి వారికి ఉపాధినిచ్చింది. అలా మార్పు మొదలైంది. ఇప్పుడు అక్కడి యవత ఆర్మీ, నేవీతో పాటు పలు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరిని పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.
హేమప్రభా చుటియా
చేనేతలో అద్భుతమైన కళాపాటవాన్ని ప్రదర్శిం చినందుకు గానూ పద్మశ్రీ అవార్డుకు ఎన్నికయ్యారు హేమప్రభా. 2014లో 80 అడుగుల ముగ సిల్క్ వస్త్రంపై అస్సామీ సాహిత్యమైన శంకరదేవుని గుణమాలని నేశారు. ఈ పనికి ఆమెకు తొమ్మిది నెలల సమయం పట్టింది. ఆ తర్వాత 15వ శతా బ్దానికి చెందిన నామ్ ఘోష్ సాహిత్యాన్ని వస్త్రంపై నేశారు. 2016 తర్వాత భగవద్గీతలోని శ్లోకాలని సంస్కృతంలోనూ, ఆ తర్వాత ఇంగ్లీష్‌లోనూ అనువ దించి వాటిని కూడా 200 అడుగుల వస్త్రంపై నేశారు. క్లిష్టమైనపని అని తెలిసినా వెనక్కి తగ్గకుండా తమ కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనేదే తన ప్రయత్నం అంటోంది ఈమె.
– లతాకమలం