వనదేవత ‘‘తులసి గౌడ’’కు పద్మ శ్రీ పురస్కారం

అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. ఆ అడవి లోనే చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడు తున్న తులసి గౌడ అనే గిరిజన మహిళ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. నిత్యం పర్యావరణం కోసం పరితపించే తులసి గౌడను ‘‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ‌ది ఫారెస్ట్, ‘‘‌వన దేవత’’ అని పిలుస్తారు. చెట్లను పెంచడమే కాదు అడవిలో పెరిగే అన్ని మొక్కల గురించి విస్తృతమైన జ్ఞానం ఆమెకు ఉంది. కర్నాటకకు చెందిన 72 ఏళ్ల గిరిజన మహిళ, పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు లభించింది.

కర్ణాటక రాష్ట్రంలోని అంకోలా తాలూకాలోని హోన్నాలి గ్రామానికి చెందిన పద్మశ్రీ తులసి గౌడ. ఆమె 30 వేలకు పైగా మొక్కలు నాటింది. అడవి లోని ప్రతి చెట్టు ఏ జాతికి చెందిందో గుర్తించడంలో ఆమె ప్రావీణ్యత సాధించింది. చదువు లేకపోయినా చెట్ల గురించి ఎంతో అవగాహన ఏర్పరచుకుంది. చెట్లను ఎప్పుడు నాటాలి.? ఎన్ని నీళ్లు పోయాలి, వాటి ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయాన్ని సులభంగా చెపుతోంది. శాస్త్రవేత్తలు కూడా ఆమె జ్ఞానాన్ని చూసి అబ్బుర పడుతుంటారు. ఇక పర్యావరణవేత్తలైతే ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ‌ఫారెస్ట్’‌గా పిలుస్తారు.

తులసి గౌడ విత్తన సేకరణలో కూడా నిష్ణాతురాలు. వివిధ వృక్ష జాతులను కాపాడటానికి విత్తన సేకరణ అవసరం. ఇది చాలా కష్టమైన పక్రియ, ఎందుకంటే మొలకల మనుగడను నిర్ధారించి తల్లి చెట్టు నుండి అంకురోత్పత్తి సమయంలో విత్తనాలను సేకరించాలి. తులసి గౌడ ఈ సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలదు. ఈ విత్తనాల సేకరణ కర్ణాటక అటవీ శాఖకు ఎంతో ఉపయోగపడుతోంది. తులసి గౌడ కర్ణాటక అటవీ శాఖలో వాలంటీర్‌గా చేరింది. పర్యావరణ పరి రక్షణలో ఆమె అంకితభావం, నిబద్ధతను గమనించిన ప్రభుత్వం ఆమెకు శాశ్వత ఉద్యోగం ఇచ్చింది. పదవీ విరమణ చేసినతరువాత కూడా మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తోంది. మొక్కల గురించి తనకు ఉన్న జ్ఞానాన్ని యువతతో పంచుకుంటోంది. అలా పర్యావరణాన్ని పరిరక్షణ సందేశాన్ని ముందుకు తీసుకువెళుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *