‘‘సీడ్‌ మదర్‌’’ సోమ్‌ పోపెరేకు పద్మశ్రీ

వ్యవసాయ రంగంలో అద్భుతమైన పద్ధతులను ప్రవేశపెట్టి అసాధారణ రీతిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న సాధారణ రైతులకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపును కల్పిస్తూ.. అటువంటి వారిని గుర్తించి పద్మ పురస్కరాలను అందిస్తోంది. అందులో భాగంగా సేంద్రీయ పద్దతులతో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ‘‘రాహీబాయి సోమ్‌ పోపెరే’’ భారతదేశ నాల్గవ అత్యున్నత పురస్కారమైన ‘‘పద్మశ్రీ’’ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గారి చేతుల మీదుగా అందుకుంది.

1964లో జన్మించిన పోపేరే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా, అకోలే గిరిజన గ్రామానికి చెందిన మహదేవ్‌ కోలి అనే గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. పేదరికం కారణంగా విద్యాభ్యాసం చేయలేకపోయింది. పదేళ్ల వయస్సు లోనే తన కుటుంబాన్ని పోషించడానికి ఆవుల పెంపకంలో వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించింది. ఆమె 17ఏళ్ల వయసులో సోమ్‌ పోపెరే అనే రైతును వివాహం చేసుకుంది. వ్యవసాయమే ఆమె కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు. ఎటువంటి విద్యాభ్యాసం లేనప్పటికీ ఆమె స్వానుభవంతో వ్యవసాయ జీవవైవిధ్యం, అడవి, ఆహార వనరులు సాంప్రదాయ  వ్యవసాయ పద్దతుల గురించి నేర్చుకుంది.

తన తండ్రి ద్వారానే దేశీ విత్తనాలు, సేంద్రీయ వ్యవసాయం గురించిన జ్ఞానాన్ని పొందినట్టు ఆమె అనేక సందర్భాల్లో తెలిపింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొదట్లో హైబ్రిడ్‌ విత్తనాలను ఉపయోగించడం ప్రారంభించిన పోపేరే దాని వల్ల తన కొడుకులు వారి పిల్లలు అనారోగ్యానికి గురికావడాన్ని గుర్తించింది. హైబ్రిడ్‌ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల వాడకమే దీనికి కారణమని గ్రహించి అప్పటి నుంచి సాంప్రదాయ పద్దతుల్లోనే వ్యవసాయం చేస్తూ ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తోంది.

దేశీయ విత్తనాలను సిద్దం చేసి ఇతరులకు కూడా అందిస్తోంది. బ్లాక్‌బెర్రీ నర్సరీని అభివృద్ధి చేసి, స్వయంసహాయక బృందం సభ్యులకు ఆ విత్తనాలను బహుమానంగా ఇస్తోంది. అలా తను నిర్వహిస్తున్న నర్సరీలలోని విత్తనాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు, బంధువులకు, రైతులకు బహుమానంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె బీజ్‌ మాత (సీడ్‌ మదర్‌ ` విత్తనాలు పంచే మాత)గా ప్రసిద్ధి చెందింది.

చిక్కుడు, వరి, కూరగాయలు, ఔషద మొక్కల నర్సరీని స్థాపించి ఏడు రైతుసంఘాలలోని 210 మంది రైతులకు విత్తనాలను పంపిణీ చేసింది. జెర్మ్‌ప్లాజమ్‌ అనే సరికొత్త విత్తన పరిరక్షణ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది 17 విభిన్న పంటలైన వరి, చిక్కుడు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు సంరక్షిస్తోంది.

రాహీబాయి తన ఇంటి పరిసరాలలో దాదాపు 200 రకాల దేశవాళీ విత్తనాలతో కూడిన విత్తన భాండాగారాన్ని దీAIఖీ అనే ఒక ఎన్జీవో సహాయంతో ఏర్పాటు చేసింది. ఇందులో పప్పులు, 30 రకాల కూరగాయలు, 11 రకాల వరి, ఇతర ఔషధ మొక్కలు ఉన్నాయి. రాహీబాయి స్థానిక విత్తనాలను సంరక్షించడానికి రాష్ట్రమంతా పర్యటించి…  దేశీయ విత్తనాల గురించి, సేంద్రీయ వ్యవసాయం, వ్యవసాయ-జీవవైవిధ్యం, అడవి ఆహార వనరుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

వ్యవసాయ చెరువు, భూగర్భ జలాశయంవంటి నీటి సేకరణ నిర్మాణాలను రూపొందించి రాహీబాయి అద్భుతమైన విజయాలను సాధించింది. రెండు ఎకరాల బంజరు భూమిని లాభదాయకమైన పొలంగా మార్చి అక్కడ పండిరచిన కూరగాయలతో డబ్బు సంపాదించడం ప్రారం భించింది. మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ రూరల్‌ ఏరియాస్‌ సహాయంతో రహీబాయి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను కూడా నేర్చుకుంది.

రాహీబాయి ప్రస్తుతం రైతులకు, విద్యార్థులకు పంట ఎంపిక, నేల సంతానోత్పత్తి పద్ధతులు, తెగుళ్ల నిర్వహణ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు అహ్మద్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. వివిధ జిల్లాలు, రాష్ట్ర స్థాయిల్లో వినూత్న పద్దతుల ద్వారా వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న రాహీబాయి భారతదేశ వ్యవసాయరంగాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *