సంఘటనతోనే ధర్మం నిలబడుతుంది : చామర్తి ఉమామహేశ్వర రావు
సంఘర్షణతో సమాజం విడిపోతుందని సంఘటన మాత్రమే మానవులను కలిపి ఉంచుతుందని తద్వారా ధర్మం చిరకాలం నిలుస్తుందని విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక భగవతి పాఠశాల ప్రాంగణంలో జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాక రాజమౌళి రచించిన భారత భారతి, భావతరంగాలు గ్రంథాల ఆవిష్కరణల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాక రాజమౌళి దేశభక్తి, దైవభక్తి కలిగిన రచయితగా అద్భుతమైన పద్య, గేయ, అనువాద కవిత్వాన్ని రచించారని, ప్రతి రచనలోనూ జ్ఞానం, శీలం, దేశభక్తి, సమానత్వం, సద్గుణాల నిర్మాణం కలగలిసి పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయని ప్రశంసించారు.
వ్యక్తిత్వం లేని మనిషి మనోవిగ్రహాన్ని సాధించలేడని తద్వారా ధర్మరక్షణ సాధ్యం కాదని, ధర్మ రక్షణ కొరకు సంఘటిత శక్తిని అలవర్చుకోవాలని తన కవిత్వం ద్వారా రాజమౌళి స్పష్టం చేశారన్నారు. పాఠకుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించి, ప్రతి పౌరున్ని కర్తవ్యపథంలో నడిపించే శక్తి ఈ కవిత్వానికి ఉందన్నారు. సరస్వతీ శిశు మందిరం ఆచార్యులుగా పనిచేసిన నేపథ్యం ఆయన కవిత్వంలో కనబడుతుందని కొనియాడారు.

అంతకుముందు పాకరాజమౌళి ఆతీశి సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ తరపున ఆయనను ఘనంగా సత్కరించారువ ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా.భీమనాథుని శంకర్, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు చిలకమారి సంజీవ, భగవతి విద్యాసంస్థల అధినేత బివరమణారావు, కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి మాట్లాడారు.
సంస్థ అధ్యక్షులు గాజుల రవీందర్ సభాధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ సభా సమన్వయం చేశారు. భారత భారతి గ్రంథాన్ని చిలకమారి సంజీవ, భావతరంగాలు గ్రంధాన్ని స్తంభంకాడి గంగాధర్ సమీక్షించారు. జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో వెలువరించిన ‘ఓ హైందవ మేలుకో! నీ ధర్మాన్ని ఎలుకో!’ కవితా సంకలనం పరిచయాన్ని డా. ముత్తినేని శ్రీనివాస్ చేశారు. ఈ సందర్భంగా 50 మంది కవులను సత్కరించారు.