భూసారానికి పంచగవ్య
భూసారాన్ని బట్టి పంట దిగుబడి, పంట నాణ్యత ఆధారపడి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. భూసారాన్ని కాపాడుకోవడం కూడా వ్యవసాయంలో చాలా ముఖ్యమైన అంశం. భూసారాన్ని దెబ్బతీయని విధంగా, దానిని మరింత పెంపొందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక లాభాల కోసం ఈ సారాన్ని దెబ్బతీసే పంటల్ని వేయడంవల్ల తాత్కాలిక ప్రయోజనం కలిగినా దీర్ఘకాలంలో నష్టం తప్పదు. భూసారాన్ని కాపాడుకునేందుకు, పెంపొందించేందుకు అనేక సంప్రదాయ పద్ధతుల్ని భారతీయులు ఉపయోగిం చారు. వాటిలో ఒకటి గోఆధారిత వ్యవసాయం. గోవు సంబంధించిన ఉత్పత్వులను ఉపయోగించు కుని భూ సంరక్షణతోపాటు అధిక దిగుబడిని కూడా సాధించవచ్చును. దేశవాళీ ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలను కలిపి పంచగవ్యం అంటారు. విత్తన శుద్ధి, భూసారాన్ని పెంపొందించ డానికి ఈ పంచగవ్యం ఉపయోగపడుతుంది.ఒక ఎకరం భూమిలో ఉపయోగించవలసిన పంచగవ్యం మోతాదు ఇలా ఉంటుంది.
10 కిలోలు – ఆవుపేడ
5 లీటర్లు – గోమూత్రం
2 లీటర్లు – ఆవు పాలు
1 లీటరు – ఆవు పెరుగు
1/4(పావు)కిలో – ఆవు నెయ్యి
ఈ ఐదింటి మిశ్రమాన్ని కనీసం గంటసేపు బాగా కలపాలి. ఆ తరువాత అందులో నుంచి కొంత విత్తన శుద్ధి కోసం తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పంచగవ్య మిశ్రమాన్ని 200 లీటర్ల స్వచ్ఛమైన నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని నీటితో తడిపిన పొలంలో వెదజల్లాలి, దీనివల్ల వాతావరం శుద్ధమై భూమిలోని జీవాణువులు బాగా వృద్ధి చెందుతాయి. భూసారం పెరుగుతుంది.