పేపర్ కప్పులలో తాగుతున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..
నేటి ఆధునిక జీవనశైలిలో టీ, కాఫీలను పేపర్ కప్పులలో తాగడం అలవాటుగా మారింది. చూడ్డానికి ఇవి కాగితంతో చేసినట్లు కనిపించినా, వీటి వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. IIT ఖరగ్‌పూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన పరిశోధనలు ఈ కప్పుల వినియోగంపై హెచ్చరిస్తున్నాయి. ఇందులో వాడే కాగితం నీటికి నానిపోకుండా ఉండటం కోసం పేపర్ కప్పుల లోపలి భాగంలో పాలిథిలిన్ అనే ప్లాస్టిక్ పొరను పూతగా పూస్తారు. మనం అందులో వేడి టీ లేదా కాఫీ పోసినప్పుడు, కేవలం 15 నిమిషాల్లో సుమారు 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలు ఆ పానీయంలో కలిసిపోతాయి.
వీటితో పాటు సీసం, క్రోమియం వంటి భార లోహాలు కూడా మన శరీరంలోకి చేరుతాయి. ఇక కేవలం ప్లాస్టిక్ పొర మాత్రమే కాకుండా మరికొన్ని ప్రమాదకరమైన రసాయనాలను ఈ కప్పుల తయారీకి ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా ఫరెవర్ కెమికల్స్ ఉంటాయి. ఇవి ఇవి కప్పు నుండి ద్రవాలు బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి శరీరంలోకి వెళ్తే విసర్జన కావు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇక బిస్ఫెనాల్ ఏ అనే రసాయనం.. ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పేపర్ కప్పుల్లోనే వినియోగించే మరో రసాయనం థాలెట్స్. ప్లాస్టిక్ పొర మెత్తగా ఉండటానికి థాలెట్స్ తోడ్పడతాయి. ఇవి జీర్ణకోశ సమస్యలకు, ఊబకాయానికి దారితీయవచ్చు. కప్పులు తెల్లగా కనిపించడానికి optical brightenersను కలుపుతారు. ఇవి చర్మ అలర్జీలను కలిగిస్తాయి. నిరంతరం పేపర్ కప్పులలో వేడి పానీయాలు తాగడం వల్ల ఈ రసాయనాలు అన్నీ శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో హార్మోన్ల సమస్యలే కాకుండా, కణజాలం దెబ్బతినడం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒక్కసారి తాగితే ఏమీ కాకపోవచ్చు, కానీ రోజువారీ అలవాటుగా మారితే మాత్రం అది మన ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనకు మేలు చేసే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. అంటే పర్యావరణానికి మేలు చేసే మట్టికప్పులు, గాజు లేదా సిరామిక్ కప్పులు, స్టీలు లేదా ఇత్తడి గ్లాసులను వాడడం ఉత్తమమైన పద్ధతి. ఆరోగ్యకరమైన సమాజం కోసం పేపర్ కప్పులను వీడి, సాంప్రదాయ పాత్రల వైపు మళ్లడం ఎంతో అవసరం.