దేశభక్తి మన పరంపరలోనే ఉంది

కుటుంబప్రబోధన్‌

‌మన వేద సాహిత్యంలోనే దేశభక్తి గురించి చెప్పారు. దేశాన్ని మాతృభూమిగా భావించమని, దేశమంటే తల్లి అని మనం అమె పుత్రులమని చెప్పారు. అమ్మ ఇంట్లో మనల్ని అన్ని విధాల సాకినట్లే మాతృభూమి మనకు పంటలనిచ్చి, మన ఉనికినీ, పోషణను, రక్షణను, భద్రతను బాధ్యతగా స్వీకరించింది. మనం చనిపోయిన తరువాత తనలో కలుపుకుంటుంది. ప్రపంచమంతా ఒక కుటుంబం, జీవనం ఒక దర్శనం అన్నారు మన ఋషులు. భగవంతుణ్ణి కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని, ప్రపంచనాయకి అని మనం స్తుతిస్తాం. ‘వయం రాష్ట్రే జాగృయామ’ (మనమంతా దేశాభివృద్ధికై జాగరూకులమై ఉండాలి) అని యజుర్వేదమంత్రం అంటుంది. కాబట్టి దేశభక్తి ఒక సనాతన వైదిక భావన. మరొక ఇంటిని కొల్లగొట్టవద్దని మన గ్రంథాలు చెప్పాయి. అందుకే ఈ దేశం దేనిపైనా తనంత తాను దాడి చేయలేదు. ఇతరుల ఆక్రమణను ఎదిరించింది. ప్రాచీన భారత చక్రవర్తి పృథువు భూమిని మాతృమూర్తిగా భావించాడు. ఈ భూమిని హింసించకుండా, మేధాశక్తితో ఇందులోని సంపదను ఎలా వెలికి తీయాలో గ్రహించాడు. ఎలా వినియోగించాలో ఆకళింపు చేసుకున్నాడు. ఈ ప్రయత్నంలో ప్రకృతికి పర్యావరణానికీ ప్రమాదం రానివిధంగా ఎలాంటి జాగృత్త తీసుకోవాలో అవలంభించాడు. అందుకే ఈ తల్లికి పృథ్వి అని పేరు వచ్చింది. దేశభక్తి యుద్ధాల సమయంలో పుట్టుకు రావాల్సిన అవసరం కాదు. అది నిత్య చైతన్యం. వేల సంవత్సరాల పరాయి పాలనలో మన వీరులెపుడూ వెన్ను చూపలేదు. విదేశీయులను ఎదుర్కొనడంలో కుటుంబాలు సైతం ఆత్మ సమర్పణ గావించు కొన్నాయి. మహమ్మద్‌ ‌బీన్‌ ‌కాశిం దండయాత్ర సమయంలో దాహిర్‌ ‌రాజు కుటుంబమంతా కలిసి ఎదుర్కొన్న చరిత్ర మనకుంది. సావర్కర్‌ ‌సోదరులు, చాపేకర్‌ ‌సోదరులు అంతకుముందు చారిత్రక కాలంలో గురుగోవింద్‌సింగ్‌ ‌కుటుంబం, అశతోష్‌ ‌ముఖర్జీ ఆయన కొడుకు శ్యాంప్రసాద్‌ ‌ముఖర్జీ, దేవేంద్రనాథ్‌• ‌ఠాగూర్‌ ఆయన కొడుకు రవీంద్రనాథ్‌ ‌ఠాగూరు, అరవింద్‌ ‌ఘోష్‌ ఆయన సోదరుడు బరీంద్ర ఘోష్‌, ‌శరత్‌బోస్‌ ‌సోదరుడు సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌రామచంద్రనాథ్‌ ఆయన సోదరుడు హరి రామచంద్ర నాథ్‌ – ఇలా అనేక కుటుంబాల నుంచి దేశభక్తులుదయించిన దేశం మనది. కుటుంబంలో సోదరులు, స్వాతంత్య్ర సమరంలో సహచరలై సమర్పన చేసిన జీవితాలు వారివి. ఈ తరహ ఉద్యమ స్ఫూర్తి మన సనాతన వైదిక వాఙ్మయమే మనకిచ్చింది. భగత్‌సింగ్‌తో బాటు ఉరిశిక్ష పడిన శివరాం రాజ్‌గురు సాయుధ పోరాటం విషయమై మాట్లాడుతూ విష్ణు సహస్రనామంలోని ‘సర్వప్రహరాణాయుధ’ అన్న మాటను ప్రస్తావిస్తాడు. ఆయుధం పట్టడం, శిరస్త్రాణం ధరించడం మన దేవతలు మనకిచ్చిన సంస్కారం. విజయదశమి పర్వదిన సమయంలో బాలాత్రిపుర సుందరి మొదలు మహిషాసుర మర్ధని వరకు అందరిలో మాతృత్వాన్ని చూసిన జాతి మనది. మహిషాసురుడి వరకు శక్తి మాతకు శివుడు త్రిశూలం, మహావిష్ణువు చక్రం, విశ్వకర్మ గొడ్డలి, ఇంద్రుడు వజ్రాయుధం, వాయు దేవుడు ధనుర్భాణ ములు, హిమవంతుడు సింహ వాహనాన్ని, వరుణుడు శంభాన్ని ఇచ్చారు. చండ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర, మహిషాసుర రాక్షసుల వధ జరిగింది. జయజయయే మహిషాసురమర్దిని రమ్య కపర్ధిని! అంటూ శంకరాచార్యులవారు స్తుతించారు. మాత దేశ నిర్మాత అయింది. మాతృభూమిని రక్షించుకుంది. కనుక మన పరంపరలో కనపడ్డ మాతృభావన మాతృభూమి భావనగా అందరం స్వీకరించాం.

– హనుమత్‌ ‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *