ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం… ‘ఎకో ఫ్రెండ్లీ’ దేవాలయాలు ఇవే
యాత్రలకు వెళ్లినా, తీర్థాలకు వెళ్లినా, విహార యాత్రకు వెళ్లినా… ప్లాస్టిక్ తీసుకెళ్లడం సర్వసాధారణమైపోయింది. వీటికి అనుబంధంగా నదులు, వాగులు, వంకలు, అడవులు, జంతువులు.. ఇలా అన్నీ అల్లుకొని వుంటాయి. మన నిర్లక్ష్యం వల్ల, ప్లాస్టిక్ వాడకం వల్ల వీటన్నింటికీ హాని కలుగుతోంది. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లిన సందర్భంగా ప్లాస్టిక్ వాడొద్దని, జూట్ బ్యాగులు వాడాలని అక్కడి అధికారులు పదే పదే చెబుతున్నా… భక్తులు పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు కూడా. అయితే.. కొన్ని ప్రధాన దేవాలయాలైన తిరుమల, అన్నవరంలో పూర్తిగా కనుమరుగైంది. తాజాగా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.
ఏపీలో యేడాదికి 25 లక్షలు, ఆపైన ఆదాయం వుండే ఆలయాలను దేవాదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు వున్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6(ఏ) కేటగిరీకి వస్తాయి. రెండు సంవత్సరాల కిందే ఈ కేటగిరీలో వచ్చే ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని దేవాలయాలన్నింటికీ ప్రభుత్వం సూచించింది. ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అలాగే మంచినీటి సరఫరా పాయింట్లు ఎక్కడ వుంటే అక్కడ స్టీల్ గ్లాసులను విరివిగా అందుబాటులో వుంచాలని కూడా తెలిపింది. దీని ద్వారా భక్తులు ప్లాస్టిక్ బాటిల్స్ వైపు వెళ్లరని ప్రత్యామ్నాయం చెప్పింది. ఒకవేళ భక్తులే స్వయంగా ఇంటి నుంచి నీటిని తెచ్చుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్‌కి బదులుగా గాజు సీసాలు లేదా స్టీల్ బాటిల్స్‌లో తెచ్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు మెళ్లిమెళ్లిగా ఇప్పుడు అమలు అవుతున్నాయి. తాజాగా శ్రీశైలం దేవస్థానం ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించగానే… ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్లాస్టిక్‌ను నిషేధించారు. జూన్ 1, 2022 నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగుతోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం ప్రకటించింది. హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా డస్ట్ బిన్లలో వుంచాలని ,తద్వారా సేకరణకు అనువుగా వుంటుందని అధికారులు ఆదేశించారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలని, ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల పాటు మాస్ క్లీనింగ్ నిర్వహించాలని కూడా సూచిచారు. ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ ఎక్కడ కనిపించినా.. దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల వినియోగాన్ని టీటీడీ పూర్తిగా నిషేధించింది. అలిపిరి చెక్‌పోస్టు వద్దే క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. ప్లాస్టిక్‌కి బదులుగా బయోడిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్ కవర్లు గానీ ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ షాంపూలు కూడా విక్రయించరాదని టీటీడీ సూచించింది.
ప్లాస్టిక్‌కి బదులుగా సంచుల్లో శ్రీవారి ప్రసాదం
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో లడ్డూ ప్రసాదాల కొరకు ‘‘వృక్ష ప్రసాదం’’ అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణహిత సంచుల్లో తులసి విత్తనాలు పొందుపరిచి భక్తులకు అందిస్తోంది. ‘‘గ్రీన్ మంత్ర’’ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ ప్రయత్నానికి మంచి ఫలితాలు, ఆదరణే వచ్చింది.ఈ సంచులు ప్లాస్టిక్ కవర్‌నే పోలి వుంటాయి. కందమూలాలతో తయారు చేసిన ఈ సంచుల్లో రెండు, మూడొందల తులసి విత్తనాలను పొందుపరుస్తారు. సంచుల్ని పడేసిన కొన్ని రోజులకు పూర్తిగా కుళ్లి, భూమిలో కలిసిపోయి, తులసి మొక్కలు మొలకెత్తేలా రూపొందించారు. దీనినినే వృక్ష ప్రసాదం అంటున్నారు.
అన్నవరంలోనూ ప్లాస్టిక్ నిషేధం
అన్నవరం దేవస్థానంలోనూ సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలులోకి వచ్చింది. 2023 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ఈవో ప్రకటించారు. లీజుదారులు ప్లాసికటక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు విక్రయించరాదన్నారు. భక్తులకు గాజు, స్టీల్, కాపర్ బాటిల్స్‌లో మాత్రమే వస్తువులు విక్రయించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు భక్తులు సహకరించాలని కోరారు. ఇక.. కొండపై వున్న దుకాణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ స్థానంలో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసిన నాన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో మాత్రమే నీటిని విక్రయించాలని సూచించారు. టీటీడీ మాదిరిగా గాజు సీసాలో నీటిని విక్రయించాలని అనుకున్నారు. వినియోగం తర్వాత ఖాళీ గాజు బాటిల్‌ను ఏ దుకాణంలో ఇచ్చినా.. 40 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు.
తాజాగా శ్రీశైలంలో నిషేధం
శ్రీశైలం దేవస్థానం పర్యావరణ హితమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీశైలం దేవస్థానం , శ్రీశైలం పరిధిలో పూర్తిగా ప్లాస్టిక్ ఫై నిషేధం విధిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఆలయ ఆవరణతో పాటు శ్రీశైలం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్ ని, ప్లాస్టిక్ కవర్లను కూడా ఇకపై విక్రయించకూడదని ప్రకటించారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్ సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కి బదులుగా మట్టి, స్టీల్ , రాగి, గాజు బాటిల్స్‌ను భక్తులు మంచి నీటి కోసం వినియోగించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈవో అన్నారు.
అయితే… గతేడాది నుంచే ప్లాస్టిక్ శ్రీశైలంలో నిషేధం వుంది. కానీ… అధికారులు గానీ, భక్తులు గానీ అంతగా పట్టించుకోలేదు. ఇకపై అలా వుండదని, దీనిని పూర్తిగా అమలు చేస్తామని , కఠినంగానే వుంటామని అన్నారు. శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ,అందుకు భక్తులందరూ సహకరించాలని ఈవో కోరారు.హోటల్ యజమానులు, నిర్వాహకులు కూడా ఈ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇకపై మరింత కఠినంగా వుంటామని, ప్రతి రోజూ తనిఖీలు చేపడతామని, అప్పటికీ మార్పులు రాకపోతే భారీ జరిమానాలు విధిస్తామన్నారు.