మణిపూర్ ను శాంతి, సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దాం : ప్రధాని మోదీ

ఘర్షణలతో చీలిపోయిన మణిపూర్ ను శాంతి, సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. మణిపూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగాలు 8,500 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అలాగే పలువురు బాధితులను కూడా పరామర్శించారు.అనంతరం చురాచాంద్ పుర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం మణిపూర్ అని అభివర్ణించారు. కానీ దురదృష్టవశాత్తు హింస వల్ల అందమైన రాష్ట్రంపై మరక పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ శిబిరంలో వున్న బాధితులతో మాట్లాడిన తర్వాత మణిపూర్ లో తిరిగి యథాతథ పరిస్థితులను చూస్తానన్న నమ్మకం కుదిరిందని ప్రకటించారు.
అభివృద్ధికి శాంతి ముఖ్యమని, గత 11 సంవత్సరాలలో ఈశాన్యంలో ఎన్నో ఘర్షణలను, వివాదాలను పరిష్కరించామని ప్రకటించారు. ఇటీవలే అనేక గ్రూపులతో కేంద్రం శాంతి చర్చలు జరిపి, శాంతి స్థాపన దిశగా తీసుకెళ్తున్నామని, అన్ని గ్రూపులు శాంతియుత మార్గంలోకి వచ్చి, కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఒకప్పుడు నిర్లక్ష్యంకు, అణచివేతకు గురైన వారిని తన ప్రభుత్వం అభివృద్ధి-కేంద్రీకృత విధానంలో ఇప్పుడు ముందుకు తీసుకువస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు.“కానీ మన విధానం చాలా భిన్నంగా ఉంది. గతంలో నిర్లక్ష్యంకు గురైన వారు ఇప్పుడు ముందంజలో ఉన్నారు. ఒకప్పుడు అణచివేతకు గురైన వారు ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చారు…” అని ఆయన చెప్పారు. రూ. 8,070 కోట్లకు పైగా ఖర్చుతో కొత్త బైరాబి- సైరాంగ్ రైలు మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ను మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో కలుపుతుంది.
ఈ ప్రాజెక్టును క్లిష్టమైన కొండ ప్రాంతాల గుండా నిర్మించారు. 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలు ఉన్నాయి. ఇది గొప్ప ఇంజనీరింగ్ పనిని చూపిస్తుంది. తన ప్రసంగంలో, ప్రధానమంత్రి మోదీ దీనిని మిజోరాంకు “చారిత్రక రోజు” అని పిలిచారు. కొత్త రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం, కొత్త అవకాశాలను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవితాలను మారుస్తుందని ప్రధాని చెప్పారు.
ఏ రాష్ట్రాభివృద్ధికైనా రోడ్డు, రైల్వే, పోరు కనెక్టివిటీ ముఖ్యమని స్పష్టం చేశారు. మిజోరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వేగవంతమైన దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మిజోరంలో రవాణా సౌకర్యాలు పెంచామని, నూతన రైళ్ల ప్రారంభోత్సవంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయని మోదీ వివరించారు. కష్టతరమైన కొండ ప్రాంతాల్లో రైల్వే సౌకర్యం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఇంజినీర్ల నైపుణ్యం, కార్మికుల స్ఫూర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని ప్రశంసించారు. కఠినమైన భూభాగంతో అనేక సవాళ్లను అధిగమించి నిర్మాణం పూర్తి చేశారని మోదీ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *