రైతు సంక్షేమం విషయంలో భారత్ రాజీపడదు : ప్రధాని మోదీ
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందిస్తూ రైతుల సంక్షేమం కోసం తాము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రైతుల సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాలని తనకు తెలుసునని పేర్కొంటూ భారమైనప్పటికీ రైతులకు ఎప్పుడూ మద్దతుగా ఉంటామని తేల్చి చెప్పారు.
అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నా గ్రామీణ ప్రాంతాల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్రీన్ రివల్యూషన్ పితామహుడు, ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అందించిన సేవలకు గౌరవంగా ఆయన శతజయంతి నేపథ్యంలో ఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటూ స్వామినాథన్ జీవితం అంతా అందరికీ ఆహారం అందించాలన్న ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
దిగవంగత ఎంఎస్ స్వామినాథన్ ఆహార భద్రతను తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారని, వ్యవసాయ శాస్త్రంలో చేసిన కృషికి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. రైతుల ప్రయోజనాలే భారతదేశానికి అత్యంత ప్రాధాన్యత అని, రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విఝయంలో భారత్ ఎప్పుడూ రాజీపడబోదని స్పష్టం చేశారు.
ఒకే కాలానికి పరిమితం కాదని కొందరు వ్యక్తులు ఉన్నారని, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథ్ అలాంటి గొప్ప వ్యక్తని పేర్కొంటూ ఆయన భూభారతి కుమారుడని కొనియాడారు. ఆయన సైన్స్‌ను ప్రజాసేవకు మాధ్యమంగా మార్చారని, రాబోయే శతాబ్దాల పాటు భారత దేశ విధానాలు, ప్రాధాన్యతలను మార్గనిర్దేశం చేసే చైతన్యాన్ని ఆయన మేల్కొల్పారని తెలిపారు.