బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి : ప్రధాని మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది సంస్కరణల ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఆత్మ నిర్భర్ భారత్ కి కేటాయింపులు చేశారని, 20247 మిషన్ లక్ష్యాల అనుగుణంగా ఈ బడ్జెట్ వుందన్నారు. త్వరలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పునరుద్ఘాటించారు.

ఈ బడ్జెట్ అంతా మానవ కేంద్రీకృతమని, విప్లవాత్మక సంస్కరణలతో భారత్ పునాదిని బలోపేతం చేస్తుందన్నారు. చారిత్రాత్మకమైన బడ్జెట్ అని అభివర్ణించారు. దీర్ఘకాలిక వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడుతుందని, బడ్జెట్ లోని ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయన్నారు. అంతేకాకుండా పౌరులను శక్తిమంతం చేస్తుందని, యువత కొత్త శిఖరాలను అధిరోహించడానికి కొత్త అవకాశాలను ఇస్తుందన్నారు.

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే వుండిపోవాలని భారతీయులు అనుకోవడం లేదని, సాధ్యమైనంత వేగంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ మహిళా సాధికారతకు నిదర్శనంగా వుందని, వరుసగా తొమ్మిది సార్లు దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టి, సీతారామన్ రికార్డు సృష్టించారని ప్రధాని ప్రశంసించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *