హిందువులను దూషించడం యాదృచ్చికమా లేక డిజైన్‌లో భాగమా? ప్రధాని మోదీ సూటి ప్రశ్న
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపైన, హిందూమతంపైన తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రమైన విషయమని, ఆయనను దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం (జూన్ 02) సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ “హిందువులను హింసాత్మకులు అంటారు.. ఇవేనా మీ విలువలు? ఇదేనా మీ వ్యక్తిత్వం? ఇదేనా ఈ దేశ హిందువులపై మీకున్న ద్వేషం?” అని ప్రశ్నించారు. హిందువులపై రాహుల్ వ్యాఖ్యలను ఈ దేశం వందల ఏళ్ల పాటు మర్చిపోదన్న ప్రధాని… హిందూ ఉగ్రవాదమనే పదాన్ని వాడటం, హిందూ మతాన్ని డెంగ్యూ, మలేరియా మొదలైనవాటితో పోల్చడం, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు చెయ్యడం తీవ్రమైన కుట్ర అన్నారు. ఈ అవమానం యాదృచ్చికమా లేక డిజైన్‌లో భాగమా? అని ప్రధాని మోదీ నిలదీశారు.
హిందూమతం గొప్పదనం, వైభవం గురించి ప్రపంచ మేథావుల సమక్షంలో స్వామి వివేకానందులు 131 ఏళ్లకు ముందు అమెరికాలోని షికాగోలో వివరించారని, హిందువులు సహనశీలురు కనుకనే మన దేశంలో వైవిధ్యం నడుమ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని ప్రధాని మోదీ తెలిపారు. హిందూమతాన్ని, భారతీయ సంస్కృతిని అవమానిస్తూ, హిందువులను పరిహసించడం ఫ్యాషన్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులను హింసావాదులనడం సంస్కారమేనా… అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో బిజెపిపై దాడి చేస్తూ “హిందువులమని చెప్పుకునే వారు హింస… ద్వేషం… 24 గంటలూ అసత్యం మాట్లాడతారు” అని దుమారం రేపారు. ఆ వ్యాఖ్యలపై ఈ విధంగా తీవ్రస్థాయిలో ప్రధానమంత్రి ప్రతిస్పందించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను రాజకీయాలకు ఆయుధంగా మార్చుకుందని విమర్శించారు.