ప్రధానికి ‘‘ధర్మ చక్రవర్తి’’ బిరుదు ప్రదానం చేసిన జైన గురువులు
సాధువులు, తత్వవేత్తల ఆలోచనలు, బోధనలతోనే ప్రపంచంలోనే అతి పురాతన, నాగరికత గల భూమిగా భారత్ వర్ధిల్లుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సేవ, మానవత్వం అన్న లక్షణాలు గల భారత్ యుగ యుగాలుగా హింసను హింసతోనే అణచివేయాలన్న దృష్టి వున్న వారికి అహింసా శక్తిని పరిచయం చేసిందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్టు సమన్వయంగా ఏర్పాటు చేసిన జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య విద్యానంద్ మహారాజ్ శతజయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి నడవాలని, కలిసి ఎదగాలన్నదే విద్యానంద మహారాజ్ ఇచ్చిన ప్రేరణ అని, తమ ప్రభుత్వ సంకల్పం కూడా అదేనని మోదీ ప్రకటించారు.
వివిధ రంగాల్లో గొప్పగా కృషి చేసిన విద్యానంద్ మహారాజ్ ఆలోచనలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సైతం ప్రేరణ అని ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కి కూడా ఆయన ఆశీస్సులు తప్పకుండా వుంటాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానిమోదీకి నిర్వాహకులు ‘‘ధర్మ చక్రవర్తి’’ అన్న బిరుదు ప్రదానం చేశారు. తాను అర్హుడినని భావించడం లేదని, కానీ గురువులు, యోగుల నుంచి ఏదీ లభించినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయమని మోదీ పేర్కొన్నారు.