ఆరెస్సెస్ ప్రపంచంలోనే అతిపెద్దదైన స్వచ్ఛంద సంస్థ : ప్రధాని మోదీ
79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావించారు.
“నూరేళ్ళ క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి ప్రస్తావించడం పట్ల నేనెంతగానో గర్వపడుతున్నాను. ఈ సంస్థ 100 ఏళ్ళుగా దేశానికి చేస్తున్న సేవలు దేదీప్యమైన మన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. “వ్యక్తి నిర్మాణం నుంచి జాతి నిర్మాణం” అనే ఆశయంతో భారతమాతను సేవించడమే లక్ష్యంగా గత 100 ఏళ్ళ నుంచీ లక్షలాదిమంది స్వయంసేవకులు మాతృభూమి సంక్షేమం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. సేవ, అంకితభావం, వ్యవస్థ, అత్యుత్తమ క్రమశిక్షణ ఈ సంస్థ గుర్తింపుగా ఉన్నాయి. 100 ఏళ్ళుగా దేశానికి నిర్విరామ సేవలందిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్దదైన స్వచ్ఛంద సంస్థ. 100 ఏళ్ళుగా దేశ సేవ కోసం జీవితాలను అంకితం చేసిన ఆ నిస్వార్థ స్వయంసేవకులను నేడు, ఈ ఎర్రకోట నుంచి స్మరించుకుంటున్నాను. తరతరాలకూ స్ఫూర్తినిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భవ్యమైన ఈ ప్రయాణాన్ని చూసి జాతి గర్విస్తోంది.’’ అని మోదీ పేర్కొన్నారు.