‘‘సేవా తీర్థ్’’ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి కార్యాలయం కొత్త భవనం ‘‘సేవా తీర్థ్’’ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 100 రూపాయల ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఇక నుంచి ఈ సేవాతీర్థ్ నుంచే ప్రధానిమోదీ కార్యకలాపాలు కొనసాగిస్తారు.
సేవా తీర్థ్ తో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1,2 ను కూడా ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకూ వేర్వేరు చోట్ల వున్న పీఎంవో, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ లను ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి మార్చనున్నారు. కర్తవ్య భవన్ 1,2 లోకి న్యాయ, రక్షణ, ఆర్థిక, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం వంటి కీలక మంత్రిత్వ శాఖలను తరలించారు.

ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తొలి గంటలో వైద్య సాయం అందడం అత్యవసరం. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పిలుస్తారు. ఈ సమయంలో వైద్యం అందితే ప్రాణాపాయం చాలా వరకూ తగ్గిపోతుంది. ఇంతటి కీలక సమయంలో నిధుల కొరత కారణంగా వైద్యసేవల్లో జాప్యం జరగకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
పీఎం రాహత్ పథకంలో రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల మేర తక్షణ వైద్య సాయం అందుతుంది. కాబట్టి, ఆసుపత్రి వర్గాలు వెంటనే వైద్యం ప్రారంభించాల్సి ఉంటుంది. తమ వద్ద తగిన సౌకర్యాలు లేకపోతే ఆసుపత్రి యాజమాన్యం స్వయంగా అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి పంపించాలి. బాధితుడు డిశ్చార్జ్ అయ్యాక ఆసుపత్రి యాజమాన్యాలు సంబంధిత ప్యాకేజీల మేరకు బిల్లులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.