వడోదరాలో సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే ప్రైవేట్‌ రంగంలో మొట్టమొదటి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్పెయిన్‌ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్‌ తో కలిసి సోమవారం ఉదయం ఈ కర్మాగారాన్ని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు.

టాటా అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. భారత్‌కు మొత్తం 56 సి-295 యుద్ధ విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో రూ.21,935 కోట్ల మేర స్పెయిన్‌తో ఒప్పందం కుదిరింది.  ఇందులో భాగంగా 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్‌ సంస్థ అందజేయనుండగా, మిగతావి వడోదర యూనిట్‌లోనే తయారవుతాయి.

ఇక ఈ ఒప్పందంలో భాగంగా స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ తయారు చేసిన సి-295 మీడియం టాక్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విమానం గతేడాది సెప్టెంబర్‌లో వాయుసేన అమ్ములపొదిలోకి చేరిన విషయం తెలిసిందే. వడోదరలో ఏర్పాటైన సి-295 విమానాల కర్మాగారం భారత్, స్పెయిన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.  వడోదరలో తయారయ్యే విమానాలు భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్ట్ ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్‌ను కూడా బలోపేతం చేస్తుందని తెలిపారు.  “గత దశాబ్దంలో భారత్ విమానయాన రంగంలో మంచి వృద్ధి సాధించింది. భారతదేశాన్ని ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో భారత్, ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడంలో వడోదరలో ఏర్పాటు చేసిన కర్మాగారం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం భారత్ రక్షణ రంగం తయారీలో ఉన్నత శిఖరాలను తాకుతోంది” అని ప్రధాని చెప్పారు.

“పదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం ఈ స్థాయిలో దేశాన్ని నిలబెట్టాయి. రక్షణ రంగం పరికరాల తయారీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని విస్తరించాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు పెద్ద కంపెనీలుగా మార్చాం. డీఆర్డీఓ, హాల్ను బలోపేతం చేశాం. యూపీ, తమిళనాడులో రెండు పెద్ద రక్షణ కారిడార్లను నిర్మించాం. ఇలాంటి ఎన్నో నిర్ణయాలు రక్షణ రంగంలో కొత్త శక్తిని నింపాయి” అని ప్రధాని వివరించారు.

 

ప్రైవేట్ క‌న్సార్టియం ఆధ్వర్యంలో భార‌త్‌లో త‌యార‌య్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. సి-295 అత్యాధునిక ర‌వాణా విమానంగా పేరొందింది. ఈ విమానంలో 71 మంది సైనిక ద‌ళాల‌ను, 50 పారాట్రూప‌ర్లను ఇది చేర‌వేస్తుంది. ప్రస్తుత బ‌రువైన విమానాలు వెళ్లలేని ప్రాంతాల‌కు సైతం సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధసామాగ్రిని, సైనికుల‌ను సుల‌భంగా త‌ర‌లిస్తాయి.

 

సుదీర్ఘకాలంగా వైమానిక దళంలో సేవలు అందిస్తోన్న ఆవ్రో-748 విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. కాగా, సి-295కు సంబంధించిన విడి భాగాల ఉత్పత్తి హైదరాబాద్‌లోని ‘మెయిన్‌ కన్‌స్టిట్యూయెంట్‌ అసెంబ్లీ’లో ఇప్పటికే ప్రారంభమైంది. వీటిని వడోదర యూనిట్‌కు తరలించి, అక్కడే తుది కూర్పు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, టాటా సన్స్‌ ఛైర్మన్ ఎన్‌. చంద్రశేఖరన్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, సాంచెజ్ కలిసి ఓపెన్ జీప్లో విమానాశ్రయం నుంచి టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు రోడ్ షోను నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *