గోండు భాషాభివృద్ధికి ఈ టీచర్ చేసిన కృషితో… దేశ వ్యాప్త గుర్తింపు

ఆదిలాబాద్ జిల్లా పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఓ ఆదివాసీ ఉపాధ్యాయుడి చేసిన కృషిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో ఆదిలాబాద్ జిల్లా ఆనందంలో మునిగితేలుతోంది. తమ భాష యాసను బ్రతికించుకునేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ చేస్తూ కృషి ఖండాతరాలు దాటుతోంది. కృత్రిమ మేథస్సు ఏఐను వినూత్నంగా వినియోగిస్తూ గోండు భాషాభివృద్ధి కి కైలాస్ పడుతున్న తాపత్రాయాన్ని‌ యావత్ ఆదివాసీ సమాజం కొనియాడుతోంది. ఇంతకీ ఎవరీ కైలాస్.. దేశప్రధాని కొనియాడేంతలా ఆయన చేస్తున్న కృషి ఇదీ.

తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత. ప్రస్తుతం ఇదే జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం, గౌరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కనుమరుగయ్యే ప్రమాదంలో పడిన మాతృభాష గోండిని రాబోయే తరాలకు అందించేందుకు ఈ ఆదివాసీ ఉపాధ్యాయుడు తోడసం కైలాస్ 2017 నుంచి యూట్యూబ్ మాధ్యమం ద్వారా గోండి భాషను ప్రచారం చేస్తున్నాడు. తాజాగా ఏఐ ని ఉపయోగించి యూట్యూబ్ లో వినూత్నంగా పాఠాలు చెబుతూ గోండి బాషను ప్రచారం చేస్తున్నారు కైలాస్. గోండి భాషపైన లోతుగా అధ్యయనం చేసి, వాడుకలో లేని కొన్ని పదాలు, పూర్వీకులు ఉపయోగించిన భాష పదాలను సేకరించిన కైలాస్.. వాటిని స్వచ్ఛమైన గోండి భాషలో రాసి.. గూగుల్ డాక్యూమెంట్, బ్లాగ్ లో భద్రపరుస్తున్నాడు కైలాస్.

తాజాగా గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి తన మాతృభాష గోండులోకి అనువదించి‌ శభాష్ అనిపించుకున్నాడు. పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి ‘సద్ విచార్’ పేరిట మరో పుస్తకం రాశారు కైలాస్. గోండి భాషలో కాండిరంగ్ వేసుడింగ్(పిల్లల ప్రపంచం) పుస్తకాన్ని గోండ్వానా సాహిత్య అకాడమీ ద్వారా విడుదల చేశారు. ఇలా గోండి బాష ప్రపంచ వ్యాప్తంగా చేసేలా.. రాబోయే ఆదివాసీ తరానికి అందించేలా కైలాస్ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్‌లో కొనియాడారు‌. గిరిజన భాషలను సంరక్షించడానికి, గోండి బాషను ప్రోత్సహించడానికి కృత్రిమ మేథస్సు (AI)ని వినూత్నంగా ఉపయోగించినందుకు అంకితభావంతో పని చేస్తున్న కైలాస్ కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ 119వ ఎడిషన్ సందర్భంగా కొనియాడారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *