‘‘వందేమాతరం’’ తో హృదయాల్లో భావోద్వేగా ఉప్పెన రేకెత్తుతుంది : ప్రధాని మోదీ
నవంబర్ 7న భారతదేశం ‘వందేమాతరం’ 150వ సంవత్సర వేడుకల్లోకి అడుగుపెడుతుందని చెబుతూ ‘వందేమాతరం’కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మన్‌కీ బాత్ 127వ ఎపిసోడ్‌లోఆదివారం ఆయన మాట్లాడుతూ బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’కు నివాళులు అర్పిస్తూ, దేశ ప్రజల హృదయాల్లో భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పాటను రచించినందుకు బంకిం చంద్ర ఛటర్జీని ఆయన ప్రశంసించారు.
“భూమి తల్లి, నేను ఆమె బిడ్డను అనే భావనతో వేదాలు భారతీయ నాగరికతకు పునాది వేశాయి. బంకించంద్ర ఛటోపాధ్యాయ ‘వందేమాతరం’ రాయడం ద్వారా మాతృభూమి, దాని పిల్లల మధ్య ఉన్న అదే సంబంధాన్ని భావోద్వేగాల విశ్వంలో ఒక మంత్రంగా ప్రతిష్టించారు” అని ప్రధాని మోదీ తెలిపారు.దసరా, దీపావళి పండుగల వేళ జీఎస్టీ శ్లాబులలో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని చెప్పారు. జీఎస్టీ మార్పులవల్ల ఈ సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చిందని ప్రధాని వెల్లడించారు.
అక్టోబర్ 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతికి ముందు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఆయనను స్మరించుకున్నారు. మాజీ భారత ఉప ప్రధానమంత్రి “ఆధునిక కాలంలో దేశపు గొప్ప ప్రముఖులలో ఒకరు” అని కొనియాడారు. సర్దార్ పటేల్ పరిశుభ్రత, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశాన్ని ఏకం చేయడానికి అసమానమైన ప్రయత్నాలు చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
“అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ యూనిటీలో మీరందరూ పాల్గొనాలని, ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి పాల్గొనాలని నేను కోరుతున్నాను” అని ఆయన పిలుపిచ్చారు. గిరిజన నేత బిర్సా ముండాకు ప్రధాని మోదీ నివాళులు అర్పిస్తూ సామాజిక కార్యకర్త బిర్సా ముండాకు నవంబర్ 15న భారతదేశం ‘జనజాతీయ గౌరవ్ దివస్’ జరుపుకుంటుందని, ఆయన గురించి మరింత చదవాలని దేశ ప్రజలను ఆయన కోరారు.