ఉగ్రవాదంపై భారత్ వైఖరిని చెప్పినందుకు గర్వంగా వుంది : అఖిలపక్ష నేతలతో మోదీ
ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రపంచ రాజధానుల్లో పర్యటించి వచ్చిన అఖిలపక్ష ప్రతినిధుల బృందాల సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు సమావేశమయ్యారు. తమ పర్యటనల వివరాలను ఎంపీలతా ప్రధానితో పంచుకున్నారు.50 మందికి పైగా ప్రతినిధులతో ఏడు బృందాలు ప్రపంచ దేశాల్లో పాక్ వైఖరిని ఎండగడుతూ, ఉగ్రవాదంపై పోరులో భారత వాణిని బలంగా వినిపించడంపై కేంద్ర ఇప్పటికే అభినందనలు తెలియజేసింది. 33 దేశాల రాజధానులు, యూరోపియన్ యూనియన్‌లో పర్యటించిన ప్రతినిధుల బృందాల్లో మాజీ పార్లమెంటెరియన్లు, మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.
“వివిధ దేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వివిధ ప్రతినిధుల సభ్యులను కలిశాను. శాంతి పట్ల భారతదేశం యొక్క నిబద్ధత, ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరించాను. వారు భారతదేశం వైఖరిని ముందుకు తెచ్చిన తీరు పట్ల మనమందరం గర్విస్తున్నాము” అని ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఉగ్రవాద ముప్పును ఎలాగైనా పెకిలించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు వివరించాయని, ఈ విషయంలో తనకెంతో గర్వంగా వుందని మోదీ ప్రకటించారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, ప్రపంచానికి పొంచి వున్న ఉగ్రవాద ముప్పును తొలగించాల్సిన అవసరం వుందని, వివిధ దేశాలకు మన బృందాలు వివరించిన తీరు మాత్రం అద్భుతమని అన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని తెలియజేయడంలో ఈ బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు.
బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, బైజంయత్ పాండ, కాంగ్రెస్ నేత శశిథరూర్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేన నేత శ్రీకాంత్ షిండే, డీఎంకే నేత కనిమొళి, ఎన్‌సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే సారథ్యంలో ఈ ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటించాయి. ఉగ్రవాదంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది.