మన తల్లుల సిందూరాన్ని చెరిపేస్తే ఏమవుతుందో చేసి చూపించాం : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ తో కలలో కూడా భారత్ అంటే పాకిస్తాన్ ఉలిక్కిపడేలా చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ తో పాక్ అహంకారాన్ని ఒక్క పెట్టున దెబ్బతీశామన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందన్నారు. ఈ సందర్భంగా భారత సైనికులకు తన తరపున, దేశ ప్రజల తరపున సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాకిస్తాన్ పై తీవ్రంగా నిప్పులు కక్కారు. సైనిక బలగాల సాహసం, పరాక్రమాన్ని దేశంలోని మహిళలకు అంకితం చేస్తున్నామని మోదీ అన్నారు. అమాయక పర్యాటకులను వారి కుటుంబ సభ్యులు, పిల్లల ముందు కాల్చి చంపారని, ఈ ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని వర్గాలు, అన్ని పార్టీలు ఒకే స్వరంతో స్పందించాయని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించాయన్నారు. మన దేశ మహిళల సింధూరాన్ని తుడిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూపించాలని నిర్ణయించామని అన్నారు.అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరు మొదలుపెట్టామన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం పేరు మాత్రమే కాదని, కోట్లాది మంది భారతీయుల సమష్టి భావోద్వేగానికి చిహ్నంగా అభివర్ణించారు. మన తల్లుల సిందూరాన్ని చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించామని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరు మొదలు పెట్టామని, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలను ధ్వంసం చేసేశామని ప్రకటించారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేసేందుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. పహల్గామ్ లో అత్యంత దారుణంగా కుటుంబీకుల ముందే వారి కుటుంబ సభ్యులను కాల్చి చంపారని, ఇది వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించిందని చెప్పారు.
ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లతో కచ్చితమైన లక్ష్యంతోనే దాడులు నిర్వహించామని ప్రధాని మోదీ తెలిపారు. బహావల్ పూర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడులకు దిగి.. ఓ భీతావహ పరిస్థితినే సృష్టించామన్నారు. గడచిన కొన్ని రోజులుగా భారత సైన్యం పరాక్రమాల్ని, సంయమనాన్ని అందరమూ చూస్తున్నామని, నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతికత సామర్థ్యాన్ని కూడా దేశ ప్రజలు చూస్తున్నారన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శిస్తోందని, భారత వీర జవాన్ల పరాక్రమాలు, ధైర్యాన్ని దేశ ప్రజలు చూశారని మోదీ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *