ప్రతి నియోజకవర్గంలోనూ ‘‘స్వదేశీ మేళాలు’’ : ఎంపీలకు ప్రధాని సూచన
మన దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు స్వదేశీ మేళాలను ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ఓ ప్రజా ఉద్యమంగా చేపట్టాలని కూడా ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎన్డీయే పక్ష ఎంపీలతో సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన స్వదేశీ వస్తువుల వినియోగంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. స్వదేశీ మేళాల ప్రాధాన్యం విషయంపైనే ఆయన ఎక్కువగా ప్రసంగించారు. శక్తిమంతమైన దేశంగా అవతరించే క్రమంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, అభివృద్ధి చెందిన భారత్ స్వప్న సాకారానికి స్వయం సమృద్ధి బాటలోనే పురోగమించాలన్నారు. ఎన్డీయే పక్ష ఎంపీలందరూ వారి వారి నియోజకవర్గాల్లో స్వదేశీ మేళాలు నిర్వహించాలని, భారత్ తయారీ వస్తువుల వినియోగాన్ని ప్రజలందరూ గర్వంగా భావించేలా చూడాలన్నారు. ఎంపీలు పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ స్వదేశీ అనే ప్రచారం భాగం కావాలని సూచించారు.