స్వదేశీ వస్తువులనే వాడండి : ప్రధాని పిలుపు
ఆర్థిక స్వావలంబనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. మేడ్ ఇన్ ఇండియా (భారతీయ ఉత్పత్తులు) వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు.
మంగళవారం గుజరాత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా హోలీ, దీపావళి, గణేష్ ఉత్సవాల సమయంలో మరింత జాగరూకతతో వుండాలన్నారు. పరోక్షంగా చైనా వస్తువుల విషయంలో ప్రధాని మోదీ ఈ హెచ్చరికలు పంపారు. గణేష విగ్రహాలు కూడా విదేశాల నుంచే వస్తున్నాయని, చిన్న చిన్న కన్నులున్న గణేషులు బాగా వస్తున్నారని, కనీసం కళ్లు కూడా తెరిచి వుండవన్నారు.
‘‘అందరూ మీ మీ ఇళ్లకు వెళ్లండి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మీ ఇంట్లో ఎన్ని విదేశీ వస్తువులు వాడుతున్నారో ఓ జాబితా తయారు చేసుకోండి. మనం మన దేశాన్ని కాపాడుకోవాలంటే, దేశాన్ని నిర్మించుకోవాలంటే, ముందుకు తీసుకెళ్లాలంటే స్వదేశీ వస్తువులు వాడాలి. ఎంత లాభాలను ఆర్జిస్తున్నా.. విదేశీ వస్తువులను అమ్మబోమని గ్రామ వ్యాపారులు ప్రతిజ్ఞ చేసేట్లు మనం ప్రోత్సహించాలి. విదేశీ దిగుమతులు భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దురదృష్టవశాత్తు గణేష విగ్రహాలు కూడా విదేశాల నుంచే వస్తున్నాయి. చిన్న కళ్లుండే గణేష్ విగ్రహాలు వస్తున్నాయి. కళ్లు కూడా సరిగ్గా తెరిచి వుండవు. హోలీ రంగులు కూడా విదేశీ తయారీవే.. ఇంట్లో వాడేవీ విదేశీవే. మనం అంతగా పరిశీలించం కానీ.. హెయిర్ పిన్స్, దువ్వెనలు కూడా విదేశాల్లో తయారైనవే’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. దేశాన్ని కాపాడుకోవాలనుకుంటే, నిర్మించాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకంటే ఆపరేషన్ సింధర్ అనేది కేవలం భద్రతా బలగాల పనే కాదని, 104 కోట్ల మంది పౌరుల బాధ్యత అని మోదీ తెలిపారు.