అర్బన్ నక్సలిజం పెరుగుతోంది.. దురదృష్టకరం : ప్రధాని మోదీ
నక్సలిజంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతోందని, దురదృష్టవశాత్తూ పట్టణాలు, నగరాల్లో వేగంగా పాతుకుపోతోందని అని అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ నక్సలిజానికి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని, ఇది దారుణమని అన్నారు.
ఢిల్లీలో ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజం అంతిమ దశలో వుందని, గతంలో 100 జిల్లాలు నక్సలిజం వల్ల ప్రభావితం అయ్యేవని, ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య రెండే డజన్లకి తగ్గిపోయిందని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఓ వైపు అడవుల నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతుంటే, మరోవైపు అర్బన్ నక్సలిజం నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు. భారతీయ సంస్కృతిని, దేశ అభివృద్ధిని అర్బన్ నక్సల్స్ వ్యతిరేకిస్తారని మండిపడ్డారు.గతంలో అర్బన్ నక్సల్స్ ను వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నాయని మోదీ మండిపడ్డారు.