ఏ రైతూ వెనుకబడొద్దు… ఇదే మా లక్ష్యం : ప్రధాని మోదీ
పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి వ్యవసాయ రంగమే ప్రధానమని, వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని మరింత వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోస్ట్ బడ్జెట్ సెమినార్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ… ఈ బడ్జెట్ భారత దృష్టిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిందన్నారు. వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై దృష్టి సారించి, రూపకల్పన చేసిందన్నారు. మరింత ముందుకు వెళ్లడానికి వ్యవసాయ రంగంలో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏ రైతు కూడా వెనుకబడి వుండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి రంగంగా, అభివృద్ధికి ప్రాథమిక ఇంజన్ గా తమ ప్రభుత్వ భావిస్తుందని మోదీ తెలిపారు. రైతులకు సాధికారత కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ప్రతి రైతునూ ముందుకు తీసుకెళ్లి, వారికి అవసరమైన తోడ్పాటును అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని వివరించారు.
ఆరేళ్ల క్రితం తమ ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రభావం దేశంపై, రైతులపై వుందన్నారు. ఈ పథకం ద్వారా 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 3.75 లక్షల కోట్లు నేరుగా జమ చేశామన్నారు.నేడు వ్యవసాయోత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. గత 10 సంవత్సరాలలో, ఉత్పత్తి 265 మిలియన్ టన్నుల నుండి 330 మిలియన్ టన్నులకు పెరిగిందని ప్రకటించారు.ఉద్యానవన ఉత్పత్తి 350 మిలియన్ టన్నులకు మించిపోయిందన్నారు.
వ్యవసాయంలో విజయం సాధించడానికి ‘బీజ్ సే బజార్ తక్’ వంటి కార్యక్రమాలను రూపొందించామని, అదనంగా, అతి తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను ప్రవేశపెట్టామని వివరించారు.