దేశం ముందుకు సాగడానికి మార్గం ‘‘సేంద్రీయ వ్యవసాయమే’’ : ప్రధాని మోదీ
భారత్ లోని రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు వేగంగా కదులుతున్నారని, దేశం ముందుకు సాగడానికి మార్గం సేంద్రీయ వ్యవసాయమని అభివర్ణించారు. కోయంబత్తూరులో నవంబర్ 19న జరిగిన సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భారత వ్యవసాయం భవిష్యత్తు సేంద్రీయ వ్యవసాయంతోనే వెలుగొందుతుందని చెప్పారు. అయితే.. తాజాగా దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘‘లింక్డిన్’’ వేదికగా వివరించారు.
‘‘కొద్ది వారాల క్రితం తమిళనాడులోని రైతుల ఆహ్వానంతో ఆయన ఈ సమ్మిట్‌లో పాల్గొన్నాను.. సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ వ్యాపారవేత్తలు, ఎఫ్‌పీవో నాయకులను కలసి వారి ప్రయాణాలను తెలుసుకున్నాను.. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ వ్యక్తులందరినీ ఏకం చేస్తున్న అంశం.. మట్టి ఆరోగ్యం, స్థిరత్వం, గ్రామీణ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయంపై వారి నిబద్ధత అపారం..’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. “సేంద్రియ వ్యవసాయం… స్వదేశీ భావన… అంటే భారత్ సొంత ఆలోచన – ఇది వేరే ప్రాంతాల నుంచి దిగుమతి కాలేదు – ఇది భారత సంప్రదాయంతో ముడిపడినది, మన పర్యావరణానికి అనుకూలమైనది” అని పేర్కొన్నారు.
భూసారాన్ని దెబ్బతీయడంతో పాటు విపరీతమైన ఖర్చులకు కారణమవుతున్న రసాయన ఎరువులు, పురుగుల మందులపై ఆధారపడే వ్యవసాయాన్ని క్రమంగా వీడి, ప్రకృతి సేద్యానికి మరింత మంది రైతులు మళ్లాలని పిలుపునిచ్చారు. ఒక సీజన్ కి, ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ, ఆత్మ విశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని సూచించారు.
ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలు వున్నాయని, భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు కూడా సమకూరుతాయని అన్నారు. ప్రకృతి సేంద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయానికి గురి చేస్తున్నాయని, వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు,వృత్తి నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి, ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నారన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం లాంటివి చేపట్టి, విజయ పథంలో కొనసాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా కొనియాడారు. సంప్రదాయ సాగు పద్ధతులకు ఆధునికత జత కలుస్తుందని, ప్రభుత్వమద్దతు కూడా ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం ఇస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ విస్తరణ, పీఎం–కిసాన్, ఎగుమతులకు ప్రోత్సాహం వంటి చర్యలు సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా రైతులు, మిల్లెట్ల ప్రోత్సాహం ఈ ఉద్యమాన్ని మరొక దిశగా తీసుకెళ్తున్నాయని అన్నారు. రసాయన ఎరువుల వాడకం పెరిగి నేల సారానికి జరిగిన నష్టాన్ని నివారించడంలో పంచగవ్య, జీవామృతం, బీజామృతం, మల్చింగ్ వంటి పద్ధతులు కీలకమని మోదీ గుర్తుచేశారు. రైతులకు ‘‘ఒక ఎకరం–ఒక సీజన్” విధానంతో సహజ వ్యవసాయం ప్రారంభించాలని మోదీ సూచించారు.
తన సందేశం చివర్లో, సహజ వ్యవసాయం గురించి పనిచేస్తున్న బృందాలు, స్టార్టప్‌లు, ఎఫ్‌పీవోలు ఉంటే తనతో పంచుకోవాలని ప్రజలను ప్రధాన మంత్రి కోరారు. భారత వ్యవసాయం – అనుబంధ రంగాల సుస్థిరాభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం ఇదని.. దీనికోసం అందరూ నడుంబిగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువ రైతులు తమ అనుభవాలు, కొత్త పద్ధతులు, జీవన ప్రయాణాలను పంచుకున్నారని మోదీ చెప్పారు. సమ్మిట్‌లో ఆయన కలిసిన కొందరి జీవిత కథలను కూడా ప్రధాన మంత్రి వివరించారు..
అరటిపండ్లు, కొబ్బరికాయలు, బొప్పాయి, మిరియాలు, పసుపుతో దాదాపు 10 ఎకరాల బహుళ-పొరల వ్యవసాయాన్ని నిర్వహించిన రైతు ఉన్నాడు. అతను 60 దేశీ ఆవులు, 400 మేకలు – కోళ్లను పెంచుతున్నాడు..
మరో రైతు మాపిల్లై సాంబా – కరుప్పు కవుని వంటి స్థానిక వరి రకాలను సంరక్షించడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. అతను విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆరోగ్య మిశ్రమాలు, పఫ్డ్ రైస్, చాక్లెట్లు – ప్రోటీన్ బార్‌లను సృష్టించడంపై దృష్టి పెడతాడు.
15 ఎకరాల సహజ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతున్న మొదటి తరం గ్రాడ్యుయేట్ ఒకరు ఉన్నారు.. 3,000 మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారు.. ప్రతి నెలా దాదాపు 30 టన్నుల కూరగాయలను సరఫరా చేశారు.
సొంతంగా FPOలను నడుపుతున్న కొంతమంది టాపియోకా రైతులకు మద్దతు ఇచ్చారు.. బయోఇథనాల్.. కంప్రెస్డ్ బయోగ్యాస్ కోసం స్థిరమైన ముడి పదార్థంగా టాపియోకా ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించారు.
వ్యవసాయ-ఆవిష్కర్తలలో ఒకరు బయోటెక్నాలజీ నిపుణులు, అతను తీరప్రాంత జిల్లాల్లో 600 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తూ సముద్రపు పాచి ఆధారిత బయోఫెర్టిలైజర్ సంస్థను నిర్మించాడు.. మరొకరు నేల ఆరోగ్యాన్ని పెంచే పోషకాలతో కూడిన బయోయాక్టివ్ బయోచార్‌ను అభివృద్ధి చేశారు. సైన్స్ – స్థిరత్వం ఎలా సజావుగా కలిసిపోతాయో వారిద్దరూ చూపించారు.