ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వని ప్రతి మూలలోనూ వినిపిస్తోంది : ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కొద్ది గంటల్లోనే మంగళవారం ఉదయం పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు.జవాన్లను కలుసుకొని, వారితో ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.మరోవైపు ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచిన వాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం’’అని ప్రధాని మోదీ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు.ఉగ్రవాదులకే కాకుండా వారికి మద్దతిస్తున్న పాక్ సైన్యానికి కూడా గట్టి సమాధానం ఇచ్చామని, దీంతో భారత దేశం తన బలాన్ని చూపించిందన్నారు. పాకిస్తాన్ సైన్యం అండని చూసుకొని, ఉగ్రవాదులు రెచ్చిపోయారో, భారత సైన్యం, భారత వైమానిక దళం, అలాగే భారతీయులు వారిని ఓడించారన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ప్రశాంతంగా కూర్చొని, ఊపిరి పీల్చుకునే స్థలం కూడా లేదన్న విషయాన్ని పాక్ బలగాలకు భారత సైన్యం చూపించిందని, ‘‘మీ ఇంట్లోకే ప్రవేశించి, మీపై దాడి చేస్తాం. మీరు తప్పించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వం’’ అన్న సందేశాన్ని కూడా పంపించామని పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో వాళ్లు పిరికిపందల్లా దాక్కున్నారని, కానీ.. భారత సైన్యాన్నే ఛాలెంజ్ చేశామన్న విషయాన్ని వారు మరిచిపోయారని, ఇప్పుడు భారత్ సత్తా వారికి తెలిసొచ్చిందన్నారు.

భారత దేశ ఆధునిక సైనిక సామర్థ్యాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘మన డ్రోన్లు, మన క్షిపణులు.. వాటి గురించి ఆలోచించడం వల్ల పాక్ చాలా నిద్రలేని రాత్రులు గడుపుతోంది’’ అని మోదీ ఎద్దేవా చేశారు. భారత దేశం బుద్ధుని భూమి అని, అలాగే గురు గోవింద్ సింగ్ భూమి కూడా అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గురుగోవింద్ సింగ్ అన్న మాటలను ప్రధాని ఉటంకించారు. ‘‘వెయ్యి మంది ముందు నిల్చున్నా.. ధర్మం వైపు మీరుంటే.. విజయం మీదే.’’ అని అనేవారన్నారు. దీనిని మీరు మరో సారి రుజువు చేశారని మోదీ సైన్యాన్ని ప్రశంసించారు. ‘‘మీరు ప్రధాన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తుడిచిపెట్టేశారు. వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇక ఒకే ఒక ఫలితం వుంటుందని ఉగ్రవాదులకు అర్థమైందని, అదే పూర్తి విధ్వంసం అని మోదీ పేర్కొన్నారు.
భారత్ లో అమాయక ప్రజల రక్తాన్ని చిందించినందుకు ఒకే ఒక పరిణామం వుంటుందని అదే వినాశ్, మహా వినాశ్ అని మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం దేశ నైతికతను పెంచిందని, దేశాన్ని ఏకం చేసి, భారత దేశ సరిహద్దులను రక్షించారని జవాన్లను ప్రశంసించారు. అలాగే భారత దేశ ఆత్మ గౌరవాన్ని కొత్త శిఖరాలకు కూడా తీసుకెళ్లారని, సైన్యం చేసిన పని అపూర్వమైందని, అసాధారణమైనది కూడా మోదీ పేర్కొన్నారు. ‘‘కదలికలలో నైపుణ్యం చూపించాడు.భయంకరమైన ఈటెలతో ఎగిరాడు. నిర్భయంగా అతను కరవాలాల మధ్యకి వెళ్లాడు. రథాల మధ్యకి తీసుకెళ్లాడు. ఈ పంక్తులు మహారాణా ప్రతాప్ గుర్రమైన చేతక్ పై రాయబడి వున్నాయి. అచ్చు.. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు భారత సైన్యానికి కూడా సరితూగుతాయి.’’ అని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
భారత జవాన్ల పరాక్రమం కారణంగానే ఈ రోజు ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వని ప్రతి మూలలోనూ వినిపిస్తోందని, ప్రతి నిమిషం భారతీయులందరూ జవాన్లతోనే నిలిచారని పేర్కొన్నారు. ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుడు తన సైనికులకు మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతతో రుణపడి వున్నారని మోదీ పేర్కొన్నారు.