మానవ వికాసానికి అయోధ్య సరికొత్త నమూనా : ప్రధాని మోదీ
రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ఆలయ శిఖరంపై పవిత్ర కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ‘ధ్వజారోహణ్ ఉత్సవ్’ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకతో ఆలయ నిర్మాణ ప్రక్రియ సంపూర్ణమైంది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ధర్మ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. ధర్మ ధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇస్తుందని స్పష్టం చేశారు. కర్మ,కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మ ధ్వజం వివరిస్తుందన్నారు. పేదలు,దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ధ్వజారోహణ కార్యకమ్రంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయన్నారు. పేదలు, దు:ఖితులు లేని సమాజాన్ని మనం కోరుకుంటున్నాం, ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసిన రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది, ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెబుతుందని, రాముడు కులంచూడడు, కేవలం భక్తి మాత్రమే చూస్తాడు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత్ లో ప్రతి ఇంట్లోనూ, ప్రతి మనసులోనూ రాముడు ఉన్నాడన పేర్కొంటూ…మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారన్నారు. రాముడు కాల్పనిక వ్యక్తి అని వారంటున్నారనీ, అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు తావు ఇవ్వొద్దని పేర్కొన్నారు. మానవ వికాసానికి అయోధ్యా కొత్త నమూనా ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.