ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ : ప్రధాని మోదీ
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి”గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ వ్యక్తీకరణ, చర్చల ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాని మోదీ ఘనా పార్లమెంటును ఉద్దేశించి ఇంగ్లీషులో ప్రసంగించారు. భారతదేశంలో 2,500 కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నప్పుడు ఘనా పార్లమెంట్‌లో అందరూ ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు.
ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. నేను మళ్ళీ చెబుతున్నాను ఇండియాలో 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయి అని అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం చర్చను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రజలను ఏకం చేస్తుంది, గౌరవానికి మద్దతు ఇస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని మోదీ అన్నారు.అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థ భారత దేశానిదని మోదీ అన్నారు. రాజకీయ, పరిపాలన స్థిరత్వాన్ని పునాదిగా చేసుకుంటూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే ఎదుగుతుందని పునరుద్ఘాటించారు. ఇప్పటికే అంతర్జాతీయ వృద్ధిలో భారత్ వాటా 16 శాతంగా వుందని ప్రకటించారు.