యువత ఆలోచనలతో వికసిత భారత్ : ప్రధాని మోదీ
అభివృద్ధి భారతం కలల సాకారానికి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత భారత్ ఆలోచనతో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని, ఎవరెవరు ఎక్కడున్నా వికసిత్ భారత్ కోసం తమ వంతు భాగస్వామ్యం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని వడ్తాల్‌లో ప్రఖ్యాత శ్రీ స్వామినారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొని ప్రసంగించారు.”నేను, మీరు, మనమంతా వికసిత్ భారత్ కోసం ప్రజలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా యువత ఆలోచనను ప్రోత్సహించి వికసత్ భారత్ కలలను సాకారం చేయాలి. అభివృద్ధి భారతం కలల సాకారంలో తొలుత దేశం స్వయం సమృద్ధి సాధించాలి” అని చెప్పారు.
“ఇందుకోసం బయట నుంచి ఎవరో సాయం రారు, మనమే దీన్ని స్వయంగా సాధించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రమోషన్‌తో ముందుకెళ్లాలి. కలిసికట్టుగా మనం ఉంటేనే ఇది సాధ్యం. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులం, లింగ వివక్ష పేరుతో దేశాన్ని విడదీయాలనుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. ఇలాంటి శక్తులను ఓడించాలి” అని ప్రదాని దిశానిర్దేశం చేశారు.యువత ఆలోచనలకు పదునుపెట్టడం ద్వారా మాత్రమే ఏ దేశమైన అభివృద్ధి పథంలోకి వెళ్తుందని లార్డ్ స్వామినారాయణ్ బోధించేవారని ప్రధాని గుర్తు చేశారు. అందుకోసం, యువతను విద్యావంతులను చేయడం, నిపుణులైన యువత అనివార్యమని ఆయన చెప్పారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశంలోని యువత తమ దేశానికి వచ్చి పనిచేయాలని అక్కడి వారు కోరుకుంటున్నారని తెలిపారు.
యువత కేవలం దేశ సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రపంచ సమస్యలను కూడా పరిష్కరించేందుకు సన్నద్ధం కావాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడటం చాలా ముఖ్యమని ప్రధాని హెచ్చరించారు. ఆ దిశగా మనమంతా పనిచేయాలని, ఇలాంటి విషయాలపై మనం అప్రమత్తంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని పేర్కొన్నారు. డీ-అడిక్షన్ కోసం స్వామినారాయణన్ కమ్యూనిటీ చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా సాధువులు, మహాత్ములు చేస్తున్న కృషి ఎంతో ఉందని ప్రధాని కొనియాడారు. అయోధ్యనే ఉదాహరణగా తీసుకుంటే 500 ఏళ్ల తర్వాత మనందరి కల సాకారమైనందని ఆయన తెలిపారు.
కాశీ, కేథార్ క్షేత్రాలను తీర్దిదిద్దిన తీరు మన కళ్లముందే ఉందని, సరికొత్త స్పృహ, కొత్త విప్లవం ప్రతిచోటా కనిపిస్తోందని చెప్పారు. ఇదొక్కటే కాదు, వేలాది సంవత్సరాల క్రితం అపహరణకు గురైన మన దేవతా విగ్రహాలను గుర్తించడం, అవి తిరిగి తమ ఆలాయాలకు తిరిగవచ్చి కొలువుతీరడం మనం చూస్తున్నామని చెప్పారు. స్వామినారాయణ్ వందిర్ ఎన్నో దశాబ్దాలుగా ప్రజల సామాజిక, ఆధ్యత్మిక జీవనంపై అమోఘమైన ప్రభావం చూపిస్తోందని ప్రధాని కొనియాడారు.