యోగా వ్యాయామమే కాదు.. అదో జీవన విధానం : ప్రధాని మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ప్రపంచానికి శుభాకాంక్షలు తెలిపారు.యోగా అనేది కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదని, అదో జీవన విధానమని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ యోగాకి హద్దుల్లేవని, అందరిదని అన్నారు. నేపథ్యం, వయస్సు, సామర్థ్యానికి అతీతమైంది యోగా అని వివరించారు. యోగా అనేది ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. యోగా అనేది యావత్ మానవాళి మళ్లీ ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన విరామ బటన్ అని అభివర్ణించారు.
యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని, 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు. యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని, అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని ప్రకటించారు.
modi23
ఆధునిక పరిశోధనల ద్వారా భారత్ యోగా శాస్త్రానికి సాధికారతనిస్తోందని, యోగా థెరపీని కూడా క్షేత్ర స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఢిల్లీలోని ఏయిమ్స్ ఈ విషయంలో బాగా పని చేసిందని ప్రశంసించారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల విషయంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే మహిళల ఆరోగ్యం, మానసిక సంతులనంలోనూ యోగాది కీలక పాత్ర అని అన్నారు.
modi234
‘‘ప్రపంచ వ్యాప్తంగా కొంత అశాంతి, ఉద్రిక్తతలతో నడుస్తోంది. అలాగే అస్థిరత కూడా పెరుగుతోంది. దురదృష్టకరం. అలాంటి సమయంలో యోగా ఓ శాంతి మార్గాన్ని సూచిస్తుంది.శ్వాస తీసుకోవడానికి, సమతౌల్యం కావడానికి, మళ్లీ క్రియాశీలం కావడానికి అవసరమైన విరామ బటన్ యోగా. యోగా అందరిది, అందరి కోసం’’ అని ప్రధాని అన్నారు.
modi23
యోగా మనల్ని నడిపిస్తోందని, మనల్ని మేల్కొలుపుతుందని అన్నారు. ‘‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’’ థీమ్ తో ఈ సారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని, యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇకో సిస్టంను డెవలప్ చేస్తున్నామని ప్రకటించారు. నేను నుంచి మనం అన్న భావన భారత దేశ ఆత్మ అని, ఎప్పుడైతే వ్యక్తి వ్యక్తిగతం నుంచి బయటకొచ్చి, సమాజం గురించి ఆలోచిస్తాడో.. అప్పుడే మానవత్వం పరిమళిస్తుందన్నారు. సర్వే భవంతు సుఖిన: అన్న భావనను భారతీయత బోధిస్తుందని, ఇదే సామాజిక సమరసతను కూడా ప్రోత్సహిస్తుందని మోదీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *