ప్రతి ఇంటినీ స్వదేశీ ప్రతీకగా మారుద్దాం : ప్రధాని మోదీ పిలుపు

ఆత్మ నిర్భర భారత్ ద్వారానే వికసిత భారత్ కల సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి దేశంలో కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం వాడే దువ్వెన కూడా స్వదేశీ అయి వుండాలని, అంత సూక్ష్మంగా చూడాలని మోదీ సూచించారు. మనం రోజు వారీ వాడే వస్తువుల్లో ఎన్నో విదేశీ వస్తువులు కలిసిపోతున్నాయని, దీని నుంచి విముక్తం కావాలని సూచించారు. ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చాలని, ప్రతి దుకాణాన్నీ స్వదేశీ వస్తువులతో నింపాలని పిలుపునిచ్చారు.

”ఇది స్వదేశీ అని, నేను స్వదేశీ వస్తువులనే కొంటానని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పండి. నేను స్వదేశీ వస్తువులను కూడా అమ్ముతానని ప్రకటించండి. దీనివల్ల దేశంతోపాటు ప్రతి రాష్ట్రంలోని తయారీ రంగం ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. దీనికోసం సహకరించాలని నేను ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’

ఇక… ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడం, జీఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఈ యేడాది కేంద్రం నుంచి డబుల్ బొనాంజా లభించినట్లయిందన్నారు. వీటి వల్ల ఈ ఒక్క యేడాదే ప్రజలకు 2.50 లక్షల కోట్ల డబ్బుఆదా అవుతుందన్నారు. దీని వల్ల వారు తమ కలలను నెరవేర్చు కోవడం మరింత సులభమవుతుందని వివరించారు. అలాగే ఇళ్ల నిర్మాణాలలో, ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

దేశ ప్రజలందరికీ అమ్మవారిని ఆరాధించే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి మొదటి రోజు నుంచే ఆత్మనిర్భర్‌ వైపు మరో కీలక అడుగు వేస్తున్నామన్నారు. మన దేశంలోని పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థాపకులు.. ఇలా అందరూ బచత్‌ ఉత్సవ్‌ (పొదుపు పండుగ) చేసుకోబోతున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని, వ్యాపారాన్ని సులభతరం చేస్తాయని, పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *