కాశీ ఇకపై ఆరోగ్య సంరక్షణా కేంద్రం కూడా : ప్రధాని మోదీ
తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని.. దీర్ఘకాలంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కాశీ నగరం ఇకపై ఆరోగ్య సంరక్షణకు పెద్ద కేంద్రంగా ఆవిర్భవించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా – శంకర కంటి ఆసుపత్రిని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. ముందుగా వేదికపై ఉన్న కంచి శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతికి మోదీ నమస్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తన మిత్రుడు, భారతదేశ ప్రసిద్ధ పెట్టుబడిదారుల్లో ఒకరైన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేరును కంటి ఆసుపత్రికి పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో కాశీతోపాటు పూర్వాంచల్ ప్రాంతమంతా అపూర్వ స్థాయిలో వైద్య సదుపాయాలను తాము విస్తరించామని తెలిపారు. కార్యక్రమంలో శంకర విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయంటూ, ‘ఎన్‌డీఏ’ అంటే నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్ (నియంత్రణ) అన్నారు. దేశంలో కంచి మఠం ఆధ్వర్యంలో ప్రారంభించిన 17వ ఆసుపత్రి ఇది. ఈ కార్యక్రమం అనంతరం వారణాసిలోని సిగ్రా స్పోర్ట్స్ కాంప్లెక్సు నుంచి రూ.6,700 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.