వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మక నిర్ణయం : ప్రధాని మోదీ
వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున వుండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలపడం ఓ చరిత్రాత్మక మలుపు. సామాజిక ఆర్థిక న్యాయం, పారదర్శకత సమ్మిళిత వృద్ధి దృష్ట్యా ఇది కీలక ఘట్టం. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు. ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి తమ సూచనలు పంపిన పౌరులకు కూడా ధన్యవాదాలు’’ అని మోదీ పేర్కొన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లిం ప్రయోజనాలను దెబ్బతీసిందని, ఈ బిల్లు ఆమోదంతో వారి హక్కులకు భద్రత లభించినట్లైందని పేర్కొన్నారు. ఈ బిల్లుతో ఇప్పుడు సామాజిక న్యాయం జరిగే ఓ ఆధునిక యగంలోకి మనం ప్రవేశిస్తున్నామన్నారు. ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన సమ్మిళిత భారత్ ను నిర్మిద్దామని మోదీ పేర్కొన్నారు.