అత్యధిక దిగుబడులిచ్చే 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
వాతావరణ మార్పులను తట్టుకొని, అత్యధిక దిగుబడులిచ్చే పోషకాలు కలిగిన 109 రకాల నూతన వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని పుసా క్యాంపస్ లో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రధాని సంభాషించారు. అధిక దిగుబడి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, బయోఫోర్టిఫైర్టిడ్ రకాల విత్తనాలను తయారీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇదో ముందడుగు అని ప్రకటించారు.
అలాగే ఈ కొత్త వంగడాల ప్రాముఖ్యాన్ని మోదీ రైతులకు వివరించారు. చిరు ధాన్యాల ప్రాధాన్యత, సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు, సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన గురించి కూడా రైతులతో ప్రస్తావించారు. 61 పంటలకు చెందిన 109 వంగడాలను విడుదల చేశామన్నారు.ఈ ఆవిష్కరణలు వ్యవసాయ రంగంలో కీలక ప్రభావం చూపుతాయని, పోషకాహార ఎంపికల వైపు ప్రజలు మళ్లుతున్నారన్నారు. ఈ కొత్త రకం విత్తనాల ప్రయోజనాలు దేశ రైతులకు చేరాలని, నెలవారీగా రైతులకు తెలియజేయాలని కృషి కేంద్రాలను కోరారు.
ప్రధాని మోదీ విడుదల చేసిన 109 రకాల విత్తనాల్లో 34 క్షేత్ర విత్తనాలు, 27 ఉద్యానవన పంటలకు సంబంధించిన విత్తనాలున్నాయి. క్షేత్ర పంటల విత్తనాలలో మినుములు, మేత పంటలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చెరుకు, పత్తి ఇతర తృణ ధాన్యాలున్నాయి. ఉద్యానవన పంటల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంప పంటలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలున్నాయి.