సంఘ్ కార్య శతాబ్ది దృష్ట్యా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపును, నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంఘ్ వందేళ్ల ప్రయాణం అద్భుతమని కొనియాడారు. దేశ నిర్మాణం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవే లక్ష్యంగా విశేష కృషి చేస్తోందన్నారు. ఆరెస్సెస్ కార్య శతాబ్ది అన్న మైలు రాయిలో భాగం కావడంపై గర్వంగా వుందన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన జ్యేష్ఠ స్వయంసేవక్, బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రాని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
కొత్తగా విడుదల చేసిన నాణేనికి ఓ వైపు జాతీయ చిహ్నం వుందని, మరోవైపు సింహంపై కూర్చున్న భారత మాత చిత్రం, ఆరెస్సెస్ స్వయంసేవకుల చిత్రాలు వున్నాయని ప్రధాని పేర్కొన్నారు. భారత కరెన్సీపై భారత మాత చిత్రం వుండటం ఇదే మొదటి సారి అని, అలాగే ‘‘రాష్ట్రీయ స్వాహా ఇదం నమ:’’ అని కూడా వుందన్నారు.