భక్తితో పాటు ఆర్థిక స్వావలంబన చేకూర్చేది మహాకుంభమేళా : ప్రధాని మోదీ
మహాకుంభ మేళా అంటే ప్రపంచం మొత్తం చర్చించుకునేది అని, ఒకే ఐక్యతా రాగం వినిపించే వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ అంటే పవిత్ర నదులు, తీర్థస్థలాలున్న ప్రాంతమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాతో దేశం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. కులాలు, తెగల ఊసే లేకుండా ఐక్యతను చాటే మహాకుంభమేళా మహాయజ్ఞాన్ని తలపించనుందన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని రూ.5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు. నదుల ప్రవాహం, స్వచ్ఛత, తీర్థయాత్ర సంగమం, కలయిక ఇవన్నీ… ప్రయాగ అని అన్నారు. ఈ ప్రాంతం మూడు పవిత్ర నదుల సంగమం మాత్రమే కాదని, ఓ పవిత్ర స్థలమన్నారు.ధర్మము, అర్థము, కామము, మోక్షము ప్రాప్తించిన భూమి ఇది అన్నారు.
సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు దైవిక శక్తులన్నీ ప్రయాగకు వస్తాయని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఓ శ్లోకాన్ని కూడా ఉదహరించారు. మరోవైపు ప్రయాగ్ రాజ్ గురించి వేదాల్లో కూడా వుందన్నారు. భారత్ వందల సంవత్సరాలుగా బానిసత్వ కాలంలో వున్నా… మరేదైనా ప్రతికూల పరిస్థితులు వున్నా… నదుల విషయంలో ప్రజల విశ్వాసం ఎప్పుడూ చెక్కు చెదరలేదన్నారు. ప్రజలకు స్వచ్ఛందంగా చైతన్య స్ఫూర్తితో నదుల విషయంలో వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇలాంటి కుంభమేళా ప్రపంచంలో ఎక్కడా జరగదని, చాలా అరుదు అని ప్రకటించారు. ఇక్కడ విజ్ఞానం, అజ్ఞానం, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోతుంది. అందరూ ఒక్కటి అవుతారని పేర్కొన్నారు.
ఈసారి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది ఇక్కడికి తరలివస్తారని, వారి భాష మరియు నమ్మకాలు భిన్నంగా ఉండవచ్చు కానీ ఇక్కడ అందరూ ఒక్కటే అవుతారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అందుకే ఇది ఐక్యతా మహాకుంభం అని చెబుతున్నానని ప్రకటించారు. ఈ మహా కుంభమేళా శ్రేష్ఠ భారత్ అన్న చిత్రాన్ని చూపిస్తుందన్నారు. సాధు సంతులు చాలా మంది వస్తారని, వారందరూ కూర్చొని, చర్చోపచర్చలు చేస్తారని, సమస్యలపై చర్చించి, పరిష్కారాలు చూపుతారని, ఇదో నిరంతర ప్రవాహంగా పేర్కొన్నారు. మహా కుంభమేళాతో చాలా మంది ముడిపడి వుంటారని, నావికులు, సహచరులు, ఆరాధకులు, వ్యాపారవేత్తలు… ఇలా అందరూ లాభపడతారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ వివిధ మార్గాల ద్వారా ఊపందుకుంటుందని, సామాజిక సామరస్యం కూడా వెల్లివిరుస్తుందన్నారు.
మహాకుంభమేళాలో తొలిసారి భక్తులు, యాత్రికుల కోసం బహుభాషా ఏఐ చాట్‌బాట్ సేవలను ఉపయోగించుకోబోతున్నామని మోదీ చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అనేక భాషల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా మహాకుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణ, విడిది సౌకర్యాల వివరాలు యాత్రికులకు ఉచితంగా అందిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
11 భారతీయ భాషల్లో వివరాలు అందించే సామర్థ్యం తో ఏర్పాటు చేయనున్నారు. డేటా, టెక్నాలజీతో ఎక్కువ మంది వ్యక్తులను కనెక్ట్ చేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మహా కుంభమేళా 2025లో కుంభ సహాయక్ భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు, ఈవెంట్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను అందించేందుకు ఈ చాట్‌బాట్‌ను ప్రారంభించనున్నట్లు మోదీ తెలియజేశారు.