ఎద్దులకు కృతజ్ఞత ప్రకటించే రైతుల పండుగ ‘‘పొలాల అమావాస్య’’
తెలంగాణ ప్రాంతంలోనే గ్రామీణ పండుగల్లో అత్యత ప్రముఖమైంది ‘‘పొలాల అమావాస్య’’. దీనిని ‘‘ఎడ్ల పండుగ (ఎద్దుల పండుగ) అని కూడా అంటారు. ఇది పూర్తిగా రైతులు, ఎద్దుల పండగే.అలాగే బసవన్నల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండగ శ్రావణమాసం చివరి రోజున అన్ని పల్లెల్లో, ముఖ్యంగా ఆదిలాబాదు జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ సంబురంగా చేసుకుంటారు. యేడాది పాటు రైతుతో పాటు కష్టపడుతూ, రైతుకు ఆదాయ
పండగకు సంప్రదాయ నేపథ్యమిదీ…
శివపార్వతుల పుత్రవాత్సల్యానికి, పొలాల అమావాస్యకి చాలా దగ్గరి సంబంధం వుంది. పుత్రులైన నందీశ్వరుడ్ని చూడాలని పార్వతీ దేవి శివుడిపై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. ఏడాది పొడవున వ్యవసాయ పనుల్లో తీవ్రమైన ఒత్తిళ్లతో పనిచేసే ఎద్దులను చూపిస్తే పార్వతీ మనస్సు బాధపడుతుందని శివుడు వాయిదా వేస్తూ వస్తాడు. కానీ శివుు పొలాల పండుగ రోజు అందంగా అలంకరించిన ఎద్దులను చూపిస్తాడు. కుటుంబసభ్యులతో పూజలందుకున్న ఎద్దులను చూసిన పార్వతీదేవీ అవి ప్రతి రోజు అలాగే ఉంటాయని మురిసిపోయి వరాలు కురిపిస్తుందనేది భక్తుల విశ్వాసం. పొలాల అమావాస్య రోజు ఎద్దులకు పనులు చెప్పరు. వాటితో వ్యవసాయం ఇతరత్రా పనులేవీ చేయించరు. పూర్తి విశ్రాంతిని ఇస్తారు.

పండగ మొదటి రోజు ఉప్పులు
రైతులు ఎడ్లను తమ ప్రాణంగా భావిస్తారు. ప్రతి రోజూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కానీ.. పొలాల అమావాస్య రోజు మాత్రం మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉదయమే ఊరిలోని రైతులందరూ తమ ఎడ్లను దగ్గరిలోని వాగులోకి తీసుకెళ్తారు. వాటికి స్నానం చేయించి, ఇంట్లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత కొమ్ములను ప్రత్యేకంగా శుభ్రం చేస్తారు. వాటికి రంగులను పూస్తారు. ఆ తర్వాత ఎడ్ల నాలుకకు ఉప్పు రాస్తారు. దీంతో వాటి నాలుక శుభ్రం అవుతుంది. దీని తర్వాత నూనె తాగిస్తారు. దీంతో వాటి జీర్ణాశయ వ్యవస్థ శుభ్రం అవుతుంది.

రెండో రోజు –
రెండో రోజు కూడా ఎద్దులకు వాగులో స్నానం చేయిస్తారు.రంగులు, అలంకరణల, గంటలు, గజ్జెలతో ఎడ్లను తయారు చేస్తారు. అలాగే వాటికి ప్రత్యేక దుస్తులను కూడా ధరింపజేస్తారు. ఆ దుస్తులకు చిన్న చిన్న అద్దాలు కూడా వుంటాయి. అలాగే ఎద్దుల కాళ్లకు గజ్జెలను కడతారు. వాటి మెడలో పెద్ద పెద్ద గంటలను కూడా కడతారు. ఈ రోజంతా రైతులు ఉపవాసంతో వుంటారు. సాయంత్రం ఎడ్లను అలంకరించిన తర్వాత వాటిని గ్రామంలోని హనుమంతుని దేవాలయం లేదా పొచమ్మ దేవాలయం చుట్టూ తిప్పుతారు. ఈ సమయంలో హరహర మహాదేవ…. హర హర మహాదేవ అంటూ.. తిప్పుతారు.
మరి కొన్ని ప్రాంతాల్లో వాగు దగ్గర, దేవాలయం దగ్గర తోరణం లాంటిది కడతారు. ఈ గ్రామ పెద్ద ఇంటి నుంచి అందరూ ఎడ్లతో హనుమంతుని ఆలయం లేదా పోచమ్మ ఆలయం దగ్గరికి ఎడ్లతో ఊరేగింపుగా వస్తారు. వచ్చిన తర్వాత మొదట గ్రామ పెద్ద దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేస్తారు. ఈ పూజల తర్వాత ఆ తోరణాన్ని తెంపుతూ.. ఎద్దులు పరిగెడుతాయి. దీంతో పొలాల అమావాస్య పండగ ప్రారంభం అవుతుంది. దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు తింపిన తర్వాత… అద్దంలో ఎద్దులను చూపిస్తారు. ఈ సమయంలోనే వాటి కళ్ల వెంబడి నీళ్లు ధారాపాతంగా వస్తాయని చెబుతారు. అంటే ఆ ఎద్దులకు శివపార్వతుల దర్శనం అవుతుందని, ఈ సమయంలో అవి పరవశించిపోయి, కళ్ల వెంబడి ఆనంద బాష్పాలు వస్తాయని చెబుతారు. దీని తర్వాత ఎద్దుల జత లేని వారి ఇళ్లకు వెళ్లి, ప్రసాదాన్ని ఎద్దులు స్వీకరిస్తాయి. ఆ తర్వాత ఇళ్లకు చేరుకుంటాయి. అప్పుడు ఆ రైతు వాటికి ప్రసాదాన్ని నివేదిస్తాడు. ఎద్దులు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే ఇంటిల్లి పాదీ భోజనం చేస్తారు. దీంతో పొలాల అమావాస్య ముగుస్తుంది.

మూడో రోజు బొడిగె :
శ్రావణ మాసంలో ఉపవాసాలు, నియమాలు పాటిస్తారు కాబట్టి, విందులు, వినోదాలకు కాస్త దూరంగానే వుంటారు. మాంసాహారం, మద్యం ముట్టుకోరు. కానీ ఈ బొడిగె రోజు మాంసాహారాన్ని వండుకొని, తింటారు. ఎద్దుల పేడను ఊరంతా చల్లుతారు. దీని ద్వారా సూక్ష్మ జీవులు ఊళ్లోకి రాకుండా వుంటాయని చెబుతారు.పొలాల అమావాస్య కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. రైతుకి, ఎద్దులకు మధ్య వున్న అనుబంధాన్ని తెలుపుతుంది. ఆత్మవత్ స్సర్వ భూతేషు అన్నట్లు ప్రతి ప్రాణిలోనూ ఈశ్వరుడ్ని చూసే భావనను పెంచుతుంది. కృతజ్ఞతను ప్రకటించుకునే పండగ కూడా.