పత్తి విత్తనాల కోసం రైతుల పాట్లు… కేంద్రాల వద్ద పడిగాపులు

ఆదిలాబాద్‌లో మంగళవారం పత్తివిత్తనాల కోసం ఎండను లెక్కచేయకుండా గంటల తరబడి బారులు తీరిన రైతులపై పోలీసులు చిందులు తొక్కారు.  ఎదురుచూస్తున్న ఆర్‌సీహెచ్‌ 659 రకం పత్తి విత్తనాల స్టాక్‌ మంగళవారం వచ్చిందని తెలిసి వేలాది మంది రైతులు ఉదయం ఆరు గంటల నుంచే పలు కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
చాలా దుకాణాలను స్టాక్‌ లేదని మూసేయడంతో ఓ సెంటర్‌ వద్దకు రైతులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. కొంత తోపులాట జరగడంతో పోలీసులు వచ్చి లాఠీలతో అదిలించారు. పెద్ద సంఖ్యలో పహారాకాస్తూ విత్తన విక్రయాలను కొనసాగించారు. కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డులతో మహిళా రైతులు, వృద్ధులు, యువకులు, పిల్లలు సైతం విత్తనాల కోసం క్యూ కట్టారు.
పత్తి విత్తనాల కోసం దాదాపు 4గంటల దాకా క్యూ కట్టినా ఒక్కో రైతుకు వ్యాపారులు 2ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. కొన్ని దుకాణాల్లో గంట లోనే విత్తనాలు అయిపోవడంతో చాలామందికి నిరాశతో వెనుదిరిగారు. స్టాక్‌ తక్కువ ఇచ్చారని, మొత్తం అమ్మేశామని వ్యాపారులు అమ్మకాలు నిలిపివేయడంతో రైతులు మరో దుకాణం వైపు పరుగులు తీయడం కనిపించింది.
ఒక్కొక్కరికి 5 నుంచి 8 ప్యాకెట్లు అవసరముంటే కేవలం రెండే ఇస్తే ఎలా అని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో దుకాణాలు ఎక్కువగా ఉండే గాంధీచౌక్‌ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.  వడ్లు, పత్తి, మక్క, సోయాబీన్‌ తదితర విత్తనాలే కాదు.. కనీసం పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలు కూడా లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం కావడంతో మంగళవారం రాష్ట్రమంతటా మండుటెండలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు, గోడౌన్లు, ఆగ్రోస్‌, డీసీఎమ్మెస్‌ దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూలో ఉండలేక పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఆధార్‌కార్డులు వరుసలో పెట్టి తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఏడీఏ కార్యాలయానికి పచ్చిరొట్ట విత్తనాల కోసం పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీస్‌ పహారా నడుమ టోకెన్లు, విత్తనాల పంపిణీ కొనసాగినా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన సొసైటీ కార్యాలయం ఎదుట పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు పొద్దంతా ఎదురుచూసినా దొరక్కపోవడంతో ఇంటిబాట పట్టారు.

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ వ్యవసాయ గోడౌన్‌ ఎదుట రైతులు పచ్చిరొట్ట కోసం క్యూ కట్టడం కనిపించింది. ఎండకు తాళలేక పాస్‌బుక్‌ జిరాక్స్‌లు వరుసలో ఉంచారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లోని రెండు ఆగ్రోస్‌ కేంద్రాల వద్ద జనుము, జీలుగు విత్తనాల కోసం ఉదయం 6గంటల నుంచే లైన్లు కట్టారు.పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ జిరాక్స్‌లను లైన్‌లో పెట్టి ఎదురు చూసినా రెండెకరాలకు ఒకటే బస్తా ఇవ్వడంతో గొణుగుకుంటూ వెనుదిరిగారు. చాలా మంది ఉత్త చేతులతోనే ఇండ్లకు వెళ్లారు. మెదక్‌ జిల్లా పాపన్నపేటలోని ఆగ్రోస్‌ సెంటర్‌, కొత్తపల్లి సహకార సంఘం వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పలేదు.

ఎండ తీవ్రంగా ఉండటంతో పాస్‌ పుస్తకాలను లైన్లో ఉంచి నిరీక్షించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లో ఓ విత్తన డీలర్‌ వద్ద ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు క్యూకట్టినా దొరక్కపోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *