నిరుపేద కుటుంబ వివాహానికి సహాయం చేసిన ‘పూర్వ సైనిక పరిషత్’

దేశ సరిహద్దులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ సైనికులు.. ఇప్పుడు సామాజిక సేవలో కూడా ముందుకు వచ్చారు. తమ సామాజిక బాధ్యతలను నెరవేర్చడం ద్వారా దేశ నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత సామాజిక సేవా రంగంలోకి వచ్చేస్తున్నారు.ఇందులో భాగంగా పూర్వ సైనిక పరిషత్.. ఇతరులతో కలిసి ఓ పేద కుటుంబానికి చెందిన కుమార్తె వివాహం కోసం సహాయం చేసింది.

జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ కుటుంబం ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఆ ఇంటి యజమాని దివ్యాంగుడు. ఆయన భార్య చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారి పెద్ద కుమార్తె వివాహం ముందే జరిగింది. చిన్న కుమార్తె వివాహం ఈ నెల 25న జరగనుంది.

అయితే.. ఈ కుటుంబం పరిస్ధితిని, వివాహం సమాచారాన్ని అఖిల భారతీయ మాజీ సైనికుల సేవా మండలి సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంది. వెంటనే ఆ కుటుంబానికి, పెళ్లికి తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. “మేము శ్రద్ధ వహిస్తాము” (And We Care) అనే నినాదంతో మండలి అధ్యక్షుడు బ్రిగేడియర్ బల్బీర్ సింగ్ సంబ్యాల్ బృందం ఆ గ్రామానికి వెళ్లింది.ఆ కుటుంబంతో మాట్లాడి, పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకుంది. కుమార్తె వివాహానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఆ కుటుంబానికి, వివాహానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చారు.

ఈ సందర్భంగా ఈ సంఘం జనరల్ సెక్రెటరీ సుఖ్ వీర్ మంకోటియా మాట్లాడుతూ.. ఈ కుటుంబానికి సహాయం చేయాలని మా సంఘం నిర్ణయించుకుంది. ఆదరించడం మన కర్తవ్యం. ఇదే సనాతన సంస్కృతికి నిజమైన ఉదాహరణ’’ అని తెలిపారు.ఇక.. ఈ కార్యక్రమంలో ఆ కుటుంబాన్ని సందర్శించిన వారిలో ఇతర మాజీ సైనికులు కూడా ఉన్నారు. వీరిలో కల్నల్ వి.ఎస్. మగోత్రా, కెప్టెన్ సుర్జిత్, కల్నల్ షామ్ మన్హాస్, కెప్టెన్ రిసాల్ సింగ్, మేజర్ సి.ఎల్. గుప్తా, కెప్టెన్ నంద్ లాల్ (మజాల్తా అధ్యక్షుడు) మరియు కెప్టెన్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *