దేశ ఐక్యత, సమగ్రత కోసం సంఘ్ పనిచేస్తోంది : నంద కుమార్

దేశ ఐక్యత, సమగ్రత కోసమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోందని ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ నంద కుమార్ అన్నారు.దైనందిన శాఖే సంఘ్ బలమన్నారు. మహారాష్ట్ర అమరావతిలోని నరసమ్మ కాలేజీ క్యాంపస్ లో జరిగిన ఆరెస్సెస్ విజయ దశమి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 లో సంఘ్ ప్రారంభించిన సమయంలో ఎలాంటి పదవులు లేవని, నేతలు కూడా లేరని, కార్యదర్శి లాంటి వారు కూడా లేరని, అయినా.. సైద్ధాంతిక పునాదులతో సంఘ్ ఎదిగిందని, ఓ వట వృక్షంలా విస్తరించిందన్నారు. దీనిని అత్యంత సహజంగానే సంఘ్ చూస్తుందన్నారు. భారత్ హిందూ దేశంగా వుండేదని, ఇకపై కూడా వుంటుందన్నదే సంఘ్ బలంగా విశ్వసిస్తుందని ప్రకటించారు.
డాక్టర్జీ ఓ వైపు వైద్య విద్యాభ్యాసం చేస్తూనే, అనుశీలన సమితిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసేవారని, ఈ సమితిలో విభిన్న దృక్పథాలున్న వ్యక్తులుండేవారని, అయితే ఈ సంస్థకి డాక్టర్జీ చేసిన సేవలు అమోఘమైనవని పునరుద్ఘాటించారు. అసలు దేశం పరాధీనత కావడానికి కారణాలేంటని డాక్టర్జీ ఆలోచిస్తున్న సమయంలో భాష, కులం, ప్రాంతంగా విభజితమైన సమాజం తన కళ్ల ముందు కదిలిందని, అప్పుడే వ్యక్తి నిర్మాణం చేయాలన్న సంకల్పాన్ని తీసుకున్నారని వివరించారు.
nandakumar ji2
మరోవైపు స్వామి వివేకానంద విదేశాలలో పర్యటిస్తున్న సమయంలో దైవీ ఆరాధన గురించిప్రస్తావించారని, అప్పుడు కేవలం ఒక్క భారత మాతను మాత్రమే పూజించాలని పేర్కొన్నారన్నారు .అలాగే అంబేద్కర్ కూడా ఓ విదేశీ విద్యాలయంలో సమర్పించిన పరిశోధనా పత్రంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ విలువలను కూడా ప్రస్తావించారన్నారు.1925 లో సంఘ్ ప్రారంభమైందని, ఇప్పుడు వటవృక్షమై కనిపిస్తోందన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంఘానికి సంబంధం లేదని, సంఘ శక్తి అంతా ఒక గంట శాఖలో నిక్షిప్తమై వుందన్నారు. సంఘ్ సంస్థాగతంగా బలపడుతూ వస్తున్నా.. సంఘ్ ఏమీ చేయాలేదని, వివిధ క్షేత్రాలలో వున్న లోపాలను స్వయంసేవకులే గ్రహించి, దానిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేశారన్నారు. అలాగే విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, వనవాసీ కల్యాణాశ్రమం లాంటి సంస్థలు వచ్చాయన్నారు.
వంద సంవత్సరాలుగా సంఘ్ శాఖలను నడుపుతోందని, ఈ శాఖల్లో చిన్నతనం నుంచి చురుగ్గా నలిగిన వారు దేశ ప్రధానమంత్రులు కూడా అయ్యారని, అంకిత భావం, నిస్వార్థ సేవే ఈ విజయానికి మూల కేంద్రాలని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *