ఎంత వెనక్కి వెళ్లి చూసినా… భారత్ అనే భావన కనిపిస్తుంది : నంద కుమార్
భారత్ అనే పేరును, భారతమాతను విమర్శించే వారు చారిత్రక, సాంస్కృతిక సత్యాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని ప్రజ్ఞ ప్రవాహ్ జాతీయ సమన్వయకర్త జె నందకుమార్ అన్నారు. రతీయ విచార కేంద్రం నిర్వహించిన రాష్ట్ర ‘పదాన శిబిరం’ (అధ్యయన శిబిరం)లో ‘విశాల భారత్, పవిత్ర భారత్’ అనే అంశంపై ప్రసంగించారు. భారత్ అనే పేరు, భారత దేశం అన్న భావన రెండు కూడా ఋగ్వేదం లాగా అత్యంత పురాతనమైనవని అన్నారు. భారత్ అనే పదం మొదట ఋగ్వేదంలోనే కనిపించిందని, దీనిని సన్యాసులు, ఋషులు ఉపనిషత్తులలో కూడా ఉపయోగించారన్నారు.
భారత్ ను తల్లిగా భావించిన వారు కూడా భారత మాత అనే భావనను వృద్ధి చేశారని, వారి ప్రకారం భారత్ అనేది కేవలం రాజకీయమైన ఉనికి మాత్రమే కాదని, సాంస్కృతిక, ఆధ్యాత్మిక దేశమని పేర్కొన్నారు. చరిత్రలో మనం ఎంత లోతుల్లోకి, వెనక్కి వెళ్లినా… భారత్ అనే ఉనికి స్పష్టంగా ద్యోతకమవుతూనే వుంటుందని, ఋగ్వేదం, వాయు పురాణం, మహాభారతం మరియు ఇతర పవిత్ర గ్రంథాలలో ప్రతిబింబిస్తుందని అన్నారు.
ఇక.. స్వాతంత్ర పోరాటంలో భారత ఐక్యత స్పష్టంగా కనిపిస్తుందని, కవులు, గాయకులు భారత మాతను కీర్తిస్తూ పద్యాలు రాసి,పాడారని గుర్తు చేశారు. అంతేకాకుండా అన్ని దేవతలను పూజించే బదులు 50 సంవత్సరాలు కేవలం భారత మాతనే ఆరాధించాలని స్వామి వివేకానంద కూడా పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్, స్వామి వివేకానంద. మహర్షి అరబిందో, రాజాజీ… ఇలా అందరూ భారత్ ను మాతృమూర్తిగానే భావించారన్నారు. ఇక.. భారత మాతకి సంబంధించి కేవలం వేదాలలోనే కాకుండా భారత రాజ్యాంగంలోనూ కనిపిస్తుందని నంద కుమార్ గుర్తు చేశారు.డాక్టర్ అంబేద్కర్‌తో సహా అందరు గొప్ప భారతీయ ఆలోచనాపరులు భారత్ సాంస్కృతిక ఐక్యత అనే ఆలోచనను సమర్థించిన వారేనని అన్నారు.