రానూ రానూ మేధోపర అణుబాంబులను ఎదుర్కోవాలి : నంద కుమార్
రానూ రానూ మేధోపరమైన అణుబాంబులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చని, వీటిని ఎదుర్కోడానికి అపారమైన అనుభవం వుండాలని, అత్యంత ప్రభావంతో వీటిని ఎదుర్కోవాలని ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ సంయోజక్ నంద కుమార్ సూచించారు. ఈ మేధోపరమైన అణుబాంబులను ఎదుర్కోడానికి స్పష్టమైన ప్రణాళిక అవసరమని సూచించారు.కేరళలో లక్ష్య పేరుతో జరిగిన సోషల్ మీడియా సంగమంలో నంద కుమార్ మాట్లాడారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించాలని, వీటిపై సమాజంలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే వుండాలన్నారు. వాస్తవ కథనాలను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం వుందన్నారు. సరైన కథనాన్ని వ్యాప్తి చేయడంలో కచ్చితంగా జాతీయవాదులం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ధ్రువ నక్షత్రం లాగా మన లక్ష్యమని అత్యంత స్పష్టంగా వుందని, అందరూ కలిసి జాతీయవాదుల సంఖ్యను మరింత పెంచుకోవాలన్నారు. దేశ వ్యతిరేకులు సంఖ్యా పరంగా ఎక్కువ సంఖ్యలో వున్నారని, తప్పుడు కథనాలను ఎక్కువగా ప్రచారం చేస్తారని, దీనిపై అప్రమత్తంగా వుండాలన్నారు. సద్గుణాలను పాటించేవారు, వాటిని నమ్మేవారు మౌనంగా వుండటం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. దేశ వ్యతిరేక శక్తులు ప్రచారం చేసే తప్పుడు కథనాల్లో ఏకరూపత వుందని, దీంతో సహజంగానే సమాజాన్ని అస్థిరపరచాలని చూస్తారన్నారు.జాతీయవాదులందరూ యుద్ధం మధ్యలో వున్నారని, మరింత బలంగా పోరాడాలని సూచించారు. దేశంలో కుటుంబ వ్యవస్థను కూల్చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా వుండాలని నంద కుమార్ సూచించారు.